Begin typing your search above and press return to search.

అన్ని పాత్రలూ ఆయనవే!

By:  Tupaki Desk   |   25 May 2015 12:33 PM GMT
అన్ని పాత్రలూ ఆయనవే!
X
ఒక సినిమా ఉందనుకోండి. దర్శకుడి పాత్ర దర్శకుడు చేయాలి. హీరో పాత్ర హీరో చేయాలి. హీరోయిన్‌ పాత్ర ఆమె చేయాలి. అలాగే ప్రభుత్వంలో కూడా నాయకుల పాత్రలు నాయకులు చేయాలి. అధికారులు తమ తమ పాత్రలో వారు జీవించాలి. అంతే తప్పితే, హీరో హీరోయిన్‌, కమెడియన్‌ కథ స్క్రీన్‌ ప్లే దర్శకత్వం సంగీతం ఇలా అన్ని పాత్రలూ ఒక్కరే చేస్తే..!? అది అత్తారింటికి దారేది సినిమాలో రేడియేటర్‌లా ఉంటుంది! తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వ్యవహార శైలి కూడా అచ్చు ఇలాగే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా ఒక అంశంపై లేదా ఒక శాఖ విషయంలో సమీక్ష సమావేశం నిర్వహించారనుకుందాం. దానికి సదరు శాఖ మంత్రిని పిలుస్తారు. అధికారులూ హాజరవుతారు. మరీ ముఖ్యమైన అంశం అయితే ఆ రంగంలో నిపుణులను కూడా పిలిచి చర్చిస్తారు. కానీ, తెలంగాణలో ఈ సంప్రదాయం కొనసాగడం లేదని చెబుతున్నారు. ఏ అంశంపై సమీక్ష నిర్వహించినా.. ఏ శాఖ సమీక్ష అయినా సదరు శాఖ మంత్రికి పిలుపు ఉండదు. ఆ శాఖ మంత్రి లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించేస్తున్నారని చెబుతున్నారు. ఇక, కేసీఆర్‌ సూచించిన ఏదైనా అంశానికి సంబంధించి ఎవరైనా అధికారి కానీ ఇంజనీరు కానీ మాట్లాడదామని భావించారనుకోండి. ఆయనకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. ఇంజనీరుకు సంబంధించిన సాంకేతిక విషయాలనూ కేసీఆరే చెప్పేస్తున్నారట. అధికారి చెప్పాల్సిన ఆర్థిక విషయాలనూ కేసీఆరే సూచిస్తున్నారట.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అన్ని అంశాల మీదా పట్టు ఉండడం మంచిదేనని, అదే సమయంలో సదరు పనిలో లోటుపాట్లు అధికారులకే తెలుస్తాయని, మంత్రులు వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి అమలు చేయాల్సి ఉంటుందని, వారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఏకపక్షంగా చేసుకుంటూ పోవడం వల్ల తెలంగాణలో అనేక పనులు చివరికంటా పూర్తి కావడం లేదని అధికార వర్గాలు వివరిస్తున్నాయి.