Begin typing your search above and press return to search.

కొన్నిసార్లు అంతే; ''హే.. ఊర్కో.. అవి పిచ్చి మాటలు''

By:  Tupaki Desk   |   3 July 2015 4:46 AM GMT
కొన్నిసార్లు అంతే; హే.. ఊర్కో.. అవి పిచ్చి మాటలు
X
తమ రాజకీయ ప్రత్యర్థుల్ని తాము తిట్టాలనుకుంటే విలేకరుల్ని పిలిపించుకొని మరీ చడామడా తిట్టేసే రాజకీయ నేతలు.. తమకు అవసరం లేదని అనుకున్నప్పుడు ఎలా వ్యవహరిస్తారన్న దానికి తాజా ఉదంతమే నిదర్శనం.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్‌ అయిన రేవంత్‌ రెడ్డి.. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ పుణ్యమా అని బుధవారం సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదల కావటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించటం.. ఈ సందర్భంగా రేవంత్‌ చెలరేగి మరీ మాట్లాడటం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. మంత్రులను ఉద్దేశించి అత్యంత పరుషంగా రేవంత్‌ మాట్లాడారు. పరుషంగా మాట్లాడతారన్న పేరున్న టీఆర్‌ఎస్‌ నేతలు సైతం విస్మయం చెందేలా రేవంత్‌ వ్యాఖ్యలు ఉన్నాయి. అందులోకి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిపై కేసీఆర్‌ రియాక్ట్‌ అవుతారని ఎవరైనా అనుకుంటారు.

గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్‌ను రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందన తెలుసుకోవటానికి ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన మీడియా ప్రతినిధులు.. ముఖ్యమంత్రి తాను చెప్పాలనుకున్నది అయినంత వరకు వెయిట్‌ చేసి.. ఆయన మాటలు పూర్తయిన వెంటనే రేవంత్‌ వ్యాఖ్యల మీద మీ స్పందన ఏమిటని అడిగేశారు. అప్పటివరకూ మామూలుగా ఉన్న కేసీఆర్‌ ఒక్కసారిగా.. ''హే.. ఊర్కో.. అవి పిచ్చి మాటలు'' అంటూ మళ్లీ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా మైక్‌ కట్‌ చేసేసి వెళ్లిపోయారు.

మామూలుగానే తనని విమర్శించిన వారిని చడమడా తిట్టేసే కేసీఆర్‌.. రేవంత్‌ విషయాన్ని అంత సింఫుల్‌గా కొట్టేయటానికి కారణం లేకపోలేదని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని ఎవరు ఏమన్నా అందుకు పది మాటలు అనేందుకు రేవంత్‌ సిద్ధమైన వేళ.. తాను కానీ ఒక్క మాట మాట్లాడినా.. అందుకు పది మాటలు పడాల్సిన పరిస్థితి ఉంటుందన్న విషయం కేసీఆర్‌కు బాగా తెలుసన్న వాదన వినిపిస్తోంది.

అందుకే ఆయన వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శించటమే కాదు.. ఒక్క మాటలో అవన్నీ పిచ్చి మాటలు అనటం ద్వారా.. రేవంత్‌ మాటలకు తాను ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లుగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో అలా చేసి ఉంటారని చెబుతున్నారు. ఎప్పుడు ఎలా వ్యవహరించాలో.. కేసీఆర్‌కు ఒకరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందా..?