Begin typing your search above and press return to search.

హతవిధీ.. మన గ్రౌండ్స్‌ ప్రపంచకప్‌కు పనికిరావట

By:  Tupaki Desk   |   1 July 2015 12:39 PM GMT
హతవిధీ.. మన గ్రౌండ్స్‌ ప్రపంచకప్‌కు పనికిరావట
X
బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు. దేశవ్యాప్తంగా బీసీసీఐ భారీ మైదానాలే నిర్మించింది. వాటి మీద వందల కోట్లు ఖర్చుబెట్టింది. అయినప్పటికీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ స్టేడియాలతో పోల్చి చూస్తే మన మైదానాలు ఆ స్థాయికి సరితూగేలా కనిపించవు. బోలెడంత డబ్బు, పవర్‌ ఉన్నప్పటికీ క్రికెట్‌ మైదానాల విషయంలోనే మనం కొంచెం వెనుకబడి ఉన్నామేమో అనిపిస్తుంది. ఇక ఫుట్‌బాల్‌లో మన దేశం ఎక్కడుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 170వ ర్యాంకులో ఏమో ఉంది మన దేశం. మన ఆటగాళ్ల స్థాయి ఏంటో.. మన మైదానాల ప్రమాణాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధించడానికి కూడా నోచుకోని దుస్థితి మనది.

ఫుట్‌బాల్‌లో మన స్థాయి ఎలా ఉన్నప్పటికీ.. భారత్‌ లాంటి పెద్ద దేశాన్ని ఫిఫా విస్మరించే పరిస్థితి లేదు. ఇక్కడ ఫుట్‌బాల్‌కు ఆదరణ పెంచి.. మార్కెట్‌ చేయగలిగితే కోట్లు కొల్లగొట్టవచ్చు. ఆ ఉద్దేశంతోనే 2017 అండర్‌-17 సాకర్‌ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని భారత్‌కు కట్టబెట్టింది ఫిఫా. ఆ టోర్నీకి ఇంకో రెండేళ్ల సమయముంది. ఈ లోపు ప్రపంచకప్‌ కోసం మైదానాలు ఎంపిక చేద్దామని వచ్చాడు టోర్నమెంట్‌ డైరెక్టర్‌ సెప్పి. కానీ ఇక్కడి మైదానాలు చూసి ఆయనకు దిమ్మదిరిగింది. దేశంలో టాప్‌ స్టేడియాలు అనుకున్నవాటిని ఆయన ప్రపంచకప్‌కు పనికి రావని తేల్చేశాడు. ''మీరసలు ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే మైదానాల్ని చూస్తున్నారా? గత ఏడాది బ్రెజిల్‌ ప్రపంచకప్‌ చూశారా? ఎలా ఉన్నాయి ఆ మైదానాలు. అవీ ప్రమాణాలంటే. మీరు ఆతిథ్యమిస్తోంది ప్రపంచకప్‌కు. అల్లాటప్పా టోర్నీకి కాదు. ఇది మీకు అద్భుత అవకాశం. అలాంటి టోర్నీకి ఇలాంటి మైదానాలిస్తారా? ఇవి చాలా చాలా మెరుగవ్వాలి. లేకుంటే కష్టం. ప్రస్తుతం ఉన్న స్థితిలో అయితే ప్రపంచకప్‌కు పనికి రావు'' అని తేల్చిచెప్పేశాడు సెప్పి. ఈ రెండేళ్లలో ప్రపంచకప్‌ స్థాయికి తగ్గట్లు మైదానాల్ని తయారు చేయమని హెచ్చరించి వెళ్లాడు.