Begin typing your search above and press return to search.

వారి విషయంలో పాక్‌.. భారత్‌ మాట వింటుందా?

By:  Tupaki Desk   |   24 May 2015 10:43 AM GMT
వారి విషయంలో పాక్‌.. భారత్‌ మాట వింటుందా?
X
ఎంత పెద్ద మొనగాడు అయినా కావొచ్చు..ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలే కానీ కుప్పకూలిపోవటం ఖాయం. భారత్‌ను చీకాకుపరుస్తూ.. దేశంలో పలు ఉగ్రవాద చర్యలకు కారణంగా భావిస్తున్న మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్స్‌ దావూద్‌ ఇబ్రహాం.. లఖ్వి.. హఫీజ్‌ సయ్యిద్‌లకు సంబంధించి బ్యాంకు ఖాతాల్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ను భారత్‌ అడగాలని భావిస్తోంది.

ఇప్పటికే ఈ ముగ్గురిపై ఐక్యరాజ్యసమి కౌన్సిల్‌ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఆస్తుల్ని.. బ్యాంకు ఖాతాల్ని స్తంభింపచేసేలా చర్యలు తీసుకోవాలని పాక్‌ ప్రభుత్వాన్ని భారత్‌ కోరనుందని చెబుతున్నారు.

ముంబయిలో బాంబుపేలుళ్లతో పాటు.. పలు దుర్మార్గాలకు పాల్పడిన దావూద్‌తో సహా.. మిగిలిన ముగ్గురు పాకిస్థాన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. దావూద్‌కు సంబంధించి పాక్‌ ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవటం తెలిసిందే. మరోవైపు.. దావూద్‌ పాక్‌లోనే ఉన్నాడంటూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడించటం.. దానికి పాక్‌ పెద్దగా స్పందించింది లేదు. మరోవైపు ఉగ్రవాది హఫీజ్‌ సయ్యిద్‌.. లఖ్వీలు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మరి.. వీరికి ముకుతాడు వేయాలని భావిస్తున్న భారత్‌కు పాక్‌ సహకరిస్తుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.