Begin typing your search above and press return to search.

ఇక మినీ ఐపీఎల్‌.. బేబీ ఐపీఎల్‌..!

By:  Tupaki Desk   |   3 July 2015 2:28 PM GMT
ఇక మినీ ఐపీఎల్‌.. బేబీ ఐపీఎల్‌..!
X
సరికొత్త ఫార్మాట్లను తెరపైకి తీసుకొచ్చి క్రికెట్‌ అభిమానులకు పండగ చేయటమే కాదు.. నాలుగు రాళ్లు ఎలా వెనకేసుకోవాలో బీసీసీఐకి తెలిసినంత బాగా మరే క్రికెట్‌ బోర్డుకి పెద్దగా తెలీదేమో. క్రికెట్‌ను ఆట కంటే వాణిజ్య వస్తువగా చూడటమే కాదు.. దాన్ని జనాలకు నచ్చే రీతిలో కనికట్టు చేయటం బీసీసీఐకి బాగానే తెలుసు.

ఛాంపియన్స్‌ లీగ్‌ ట్వంటీ 20 టోర్నీ విఫలం కావటంతో ఆలోచనలో పడ్డ బోర్డు తాజాగా సరికొత్త ఫార్మాట్ల మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విఫలమైన ఛాంపియన్స్‌ లీగ్‌ ట్వంటీ 20 స్థానే.. మరో కొత్త ఫార్మాట్‌తో క్రికెట్‌ ఆటను క్రీడాభిమానుల్ని అలరించేలా ప్లాన్స్‌ వేస్తోంది. ఇందులో భాగంగా రెండు కాన్సెప్ట్‌లను తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు.

ఆ రెండింటిలో ఒకటి మినీ ఐపీఎల్‌ అయితే.. రెండోది బేబీ ఐపీఎల్‌గా చెబుతున్నారు. మినీ ఐపీఎల్‌లో.. ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన నాలుగు జట్లతో టోర్నీని నిర్వహించటం. ఇందులో ఏడు టోర్నీ మ్యాచ్‌లు.. ఒక గ్రాండ్‌ ఫైనల్‌ను నిర్వహించి టోర్నీని ముగించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోదాని విషయానికి వస్తే.. మొత్తం ఎనిమిది ఐపీఎల్‌ జట్లతో టోర్నీని నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో ఎనిమిది జట్లను నాలుగు గ్రూపులుగా చేసి.. మొత్తం 13 లీగ్‌ మ్యాచ్‌లు.. రెండు సెమీఫైనల్స్‌తో పాటు.. ఒక గ్రాండ్‌ ఫైనల్‌ నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో ఉన్నారు.

ఈ రెండు ఫార్మాట్లలో దేన్ని నిర్వహిస్తే బాగుంటుందన్న అంశాన్ని బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ సమాలోచనలు జరిపి డిసైడ్‌ చేస్తుందని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు ఫార్మాట్లలో మినీ ఐపీఎల్‌ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని.. టోర్నీ సింఫుల్‌గా ముగిసిపోతుందని. అదే.. బేబీ ఐపీఎల్‌ అయితే కాస్తంత మజాతో పాటు.. భావోద్వేగాల్నికూడా రగిలించే అవకాశం ఉందన్న వాదన వ్యక్తమవుతోంది. మరి.. ఈ రెండింటిలో బీసీసీఐ దేన్ని డిసైడ్‌ చేస్తారో చూడాలి.