Begin typing your search above and press return to search.

చావుదెబ్బ: టాలీవుడ్‌పై హాలీవుడ్‌ హల్‌చల్‌

By:  Tupaki Desk   |   25 May 2015 1:30 AM GMT
చావుదెబ్బ: టాలీవుడ్‌పై హాలీవుడ్‌ హల్‌చల్‌
X
తెలుగు సినిమాలో విషయం లేని తనం పొరుగు సినిమాకి కలిసొస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్‌ సినిమాలకు పెద్ద మార్కెట్‌ని తెచ్చిపెడుతోంది. ఇటీవలి కాలంలో మనవాళ్లు తీసే మూస సినిమాల కంటే హాలీవుడ్‌ నుంచి వచ్చే విజువల్‌ వండర్సే ప్రేక్షకుల్ని ఎక్కు ఆకర్షిస్తున్నాయన్నది తాజా సర్వేలో తేలిన అంశం. భాష సమస్యతో పనిలేకుండా ఇప్పుడు హాలీవుడ్‌ సినిమాలు కూడా తెలుగులోకి డబ్‌ అయి వస్తున్నాయి.

డబ్‌ అయిన హాలీవుడ్‌ సినిమాలను దాదాపు 130 నుంచి 150 స్క్రీన్లలో వేస్తున్నారు. ఒరిజినల్‌ వెర్షన్‌ ఇంగ్లీష్‌లోనే 25థియుటర్లలో ఆడిస్తున్నారు. ఏపీ, తెలంగాణ కలుపుకుని ఇంత పెద్ద మొత్తంలో రిలీజవుతున్నాయి కాబట్టి వసూళ్లు కూడా ఆ రేంజుకి పెరిగాయని ప్రముఖ మల్టీప్లెక్స్‌ థియేటర్ల ప్రతినిధులు చెబుతున్నారు. అవతార్‌, ట్రాన్స్‌ఫార్మర్స్‌, ఎవెంజర్స్‌ వంటి సినిమాలు తెలుగులోనూ దుమ్ము దులిపేశాయి. వసూళ్ల రికార్డుల్ని తిరగరాశాయి. అవేకాదు ఇప్పుడు డబ్బింగ్‌ అయ్యి వస్తున్న ప్రతి సినిమా భారీ వసూళ్లను సాధించి వాటిని లోకల్‌గా రిలీజ్‌ చేస్తున్న నిర్మాతల జేబులు నింపుతున్నాయని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో రిలీజైన మ్యాడ్‌ మ్యాక్స్‌ తెలుగు ప్రేక్షకుల నుంచి 1.5కోట్లు వసూలు చేసి ఇంకా ఫుల్స్‌తో రన్‌ అవుతోంది. అలాగే ఎవెంజర్స్‌ 3.5కోట్లు వసూలు చేసి ఫుల్‌రన్‌లో ఉంది. ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ రూ.5కోట్లు, ట్రాన్స్‌ఫార్మర్స్‌ 3కోట్లు వసూలు చేశాయి. అయితే ఈ సినిమాల కోసం లోకల్‌ నిర్మాత ఖర్చు చేసింది కేవలం కోటి లేదా 2కోట్లు మాత్రమే. అంటే రెట్టింపును మించి లాభాల్ని ఆర్జిస్తున్నారనే దీనర్థం.

తెలుగునాట బుల్లితెరపై హాలీవుడ్‌ అనువాదాలు హవా సాగిస్తున్న నేపథ్యంలో అందరికీ ఆంగ్ల సినిమాపై అవగాహన పెరిగింది. కాబట్టి ఆ మేరకు హాలీవుడ్‌ సినిమాకి గిరాకీ పెరిగి టాలీవుడ్‌ సినిమాకి చిల్లు పడిందన్నమాటే!