Begin typing your search above and press return to search.

తోటి జడ్జినే లైంగికంగా వేధిస్తే...

By:  Tupaki Desk   |   2 July 2015 9:18 AM GMT
తోటి జడ్జినే లైంగికంగా వేధిస్తే...
X
న్యాయం చెప్పాల్సినవారే అన్యాయంగా ప్రవర్తిస్తే... అందరూ కాకపోయినా తులసివనంలో గంజాయిమొక్కల్లాంటి అలాంటి వ్యక్తుల కారణంగా సమాజంపై నమ్మక పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో అలాంటి సంఘటనే జరిగింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక మహిళా న్యాయమూర్తి పట్ల మరో న్యాయమూర్తి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది.

అక్కడి ట్రయల్ కోర్టులో జడ్జిలుగా పనిచేస్తున్న ఇద్దరు న్యాయమూర్తులు గత నెల 8న మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై మనాలిలో జరుగుతున్న సదస్సుకు హాజరయ్యారు. ఇద్దరు జడ్జిల్లో ఒకరు మహిళ... ఆమెతో పాటు వచ్చిన తోటి పురుష జడ్జి నుంచి ఆమెకు అనుకోని అనుభవం ఎదురైంది. ఆ పురుష జడ్జి తన మహిళా న్యాయమూర్తిని తనతోపాటు రిసార్ట్‌కు రావాలని బలవంతం చేయడమే కాకుండా లైంగికంగా వేధించారట. దీంతో ఆమె హిమాచల్ హైకోర్టులో ఫిర్యాదు చేయడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ వేధింపుల జడ్జిని సస్పెండ్‌ చేశారు.

దీనిపై విచారణకు ఆదేశించి అది పూర్తయ్యే వరకు ఆయన విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు నెలల లోపు విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని దర్యాప్తు చేస్తున్న అధికారులకు సూచించారు.