Begin typing your search above and press return to search.

మంచి రోజులు రాలేదు గానీ మోడీపై మోజు తగ్గలేదు

By:  Tupaki Desk   |   24 May 2015 11:30 AM GMT
మంచి రోజులు రాలేదు గానీ మోడీపై మోజు తగ్గలేదు
X
నరేంద్ర మోడీ ఏడాది పాలనపై ఎన్నో విమర్శలు.. మరెన్నో ప్రశంసలు. ఆయనకు అనుకూల వర్గాలన్నీ అనుకూలమైన అంశాలను ప్రస్తావించి ఈ ఏడాది పాలన అత్యద్భుతమంటూ కీర్తిస్తుండగా... వైరి వర్గాలు మాత్రం ఇచ్చిన హామీల అమలును ప్రస్తావిస్తూ అట్టర్‌ ఫెయిల్యూర్‌ గా అభివర్ణిస్తున్నాయి. అయితే బీజేపీ చెబుతున్నంత స్థాయిలో మంచి రోజులు రాలేదన్నది మాత్రం తిరుగులేని సత్యం.

మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఇండియాటుడే-సిసిరో సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్త సర్వే చేశారు. లోక్సభ ఎన్నికలనాటితో పోలిస్తే బీజేపీ ఓటు బ్యాంకు స్వల్పంగా పెరిగిందని ఈ సర్వే వెల్లడించింది. మొత్తంగా ఈ సర్వేలో 7652 మంది అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 56శాతం మోడీ పాలన బాగుందన్నారు. ద్రవ్యోల్బణం అదుపు, ధరలకు కళ్లెం, విదేశాంగ విధానం, స్వచ్ఛభారత్‌, అవినీతి నియంత్రణ మోడీ విజయాలుగా వారు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛభారత్‌ పట్ల ప్రజల్లో మంచి ఆదరణ కనిపించింది. ప్రధాని పదవికి మోడీయే సరైన వ్యక్తని 89 శాతం మంది చెప్పగా రాహుల్‌ కు కేవలం 11 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు.

- స్వచ్ఛభారత్‌ తో తమ పరిసరాలు బాగుపడ్డాయని 57శాతం తెలిపారు.

- పేదలందరికీ బ్యాంకు ఖాతా జన్‌ధన్‌ యోజనకూ పెద్ద ఎత్తున మద్దతు దొరికింది.

- సూటుబూటు సర్కార్‌ అంటూ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన విమర్శతో 43 శాతం మంది ఏకీభవించగా 57 శాతం మంది మాత్రం అదంతా రాజకీయ ఓర్వలేనితనమని కొట్టిపారేశారు.

- మోడీ ప్రభుత్వం పేదలకు అనుకూలమని 23 శాతం అభిప్రాయపడ్డారు.

- రైతుల సమస్యలను పరిష్కరించలేదని 30 శాతం అసంతృప్తి చెందారు.

- మోడీ తమ అంచనాలకు తగినట్లు పని చేయడం లేదని 46శాతం తెలిపారు.

- ప్రస్తుత నేతల్లో ఎవరు బెస్ట్‌ అనే ప్రశ్నకు 2014 ఆగస్టు నాటి సర్వేలో 57శాతం మోడీకి జేజేలు కొట్టారు. ఇప్పుడు అది 33శాతానికి పడిపోయింది.

- మోడీ హయాంలో మైనారిటీలపై దాడులు జరగడంలేదని 51 శాతం అభిప్రాయపడ్డారు.

- మోడీ ప్రభుత్వంతో దేశానికి మంచి రోజులు వచ్చాయని 47 శాతం చెప్పారు.

- తాము సోషల్‌ మీడియాలో మోడీని ఫాలో కావడం లేదని 72శాతం చెప్పారు.

- మారుమూల పల్లెల్లో సైతం వినిపించేందుకు మోడీ ఎంచుకున్న మన్‌కీ బాత్‌కూ పెద్దగా స్పందన లేదు. రేడియోలో ప్రసారమయ్యే ఈ ప్రసంగాన్ని విననేలేదని 56శాతం చెప్పారు.

- అయితే.... ప్రధాని పదవికి మోడీయే తగిన వ్యక్తి అని ఎక్కువ శాతం మంది తేల్చారు. ప్రధాని పదవికి రాహుల్‌ సరైనవ్యక్తని చెప్పినవారు కేవలం 11 శాతమే.