Begin typing your search above and press return to search.

పశువులకు ''108'' సేవలు

By:  Tupaki Desk   |   23 May 2015 4:14 AM GMT
పశువులకు 108 సేవలు
X
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో స్టార్ట్‌ చేసిన 108 సేవలు తెలుగు ప్రజలకు అపర సంజీవిలా మారటమే కాదు.. దేశంలోని పలు రాష్ట్రాలకు ఇదో స్ఫూర్తినిచ్చింది. ప్రభుత్వాలు మారిన వెంటనే పథకాల్ని మూలన పడేసే విధానానికి భిన్నంగా.. 108 సేవల్ని ఆపే సాహసం ఏ ప్రభుత్వం ఇప్పటివరకూ తీసుకోలేదు. సామాన్యుల నుంచి వీఐపీల వరకూ అపత్‌కాలంలో సాయంగా నిలిచే 108 సేవలు ఎంత కీలకమో తెలిసిందే.

ఇప్పటివరకూ అందిస్తున్న 108 సేవల తరహాలోనే మూగజీవాలకు ఒక ప్రత్యేక సేవల విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా.. తెలంగాణ వ్యాప్తంగా ఉండే మూగజీవాలకు 108 సేవల తరహాలోనే సేవలు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

మెదక్‌ జిల్లాలో జరిగిన పశుప్రదర్శనలో పాల్గన్న ఆయన.. పశువులకు సైతం 108 సేవల తరహాలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఒకవేళ.. హరీశ్‌ చెప్పిన మాట.. ఆచరణలో సాధ్యమైతే.. ఈ విధానం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మారటం ఖాయం. గ్రామాల్లోని పశువులకు సరైన వైద్య సదుపాయాలు లేక మరణిస్తున్న నేపథ్యంలో.. 108 సేవలు వాటి పాలిట వరంగా మారతాయనటంలో సందేహం లేదు.