Begin typing your search above and press return to search.

దేశమే ఆర్థిక సంక్షోభంలో పడితే జనం పరిస్థితి..?

By:  Tupaki Desk   |   29 Jun 2015 12:55 PM GMT
దేశమే ఆర్థిక సంక్షోభంలో పడితే జనం పరిస్థితి..?
X
ఏదైనా ఆర్థిక సంస్థలో పెట్టుబడి పెట్టి.. సదరు కంపెనీ నష్టాల్లోకి చిక్కుకుపోయి ఐపీ పెడితే.. పెట్టిన పెట్టుబడి మొత్తం హుష్‌కాకే. మరి.. ఒక దేశమే ఆర్థిక సంక్షోభంలో పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది తాజాగా గ్రీసు పరిస్థితి చూస్తే అర్థమవుతోంది.

ఆర్థికంగా బలోపేతంగా ఉంటాయని భావించే యూరోపియన్‌ దేశాలకు భిన్నంగా గ్రీస్‌ దేశం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోవటం.. అప్పుల ఊబిలో నుంచి బయటకు రాలేక.. సంక్షోభంలో చిక్కుకుపోవటం తెలిసిందే.

గ్రీసు సంక్షోభం నేపథ్యంలో ప్రపంచంలోని స్టాక్‌మార్కెట్లు అన్ని బ్లడ్‌బాత్‌ చేస్తుంటే.. ఇక గ్రీసులో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బ్యాంకుల్లో డబ్బులు ఉన్నా.. చేతిలో చిల్లిగవ్వ లేక కిందామీదా పడిపోయే పరిస్థితి. దేశం ఐపీ పెట్టటంతో.. బ్యాంకుల్లో డబ్బులు ఉన్న వారు వాటిని డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్ల వద్ద క్యూలు కడుతున్నారు.

ఈ క్యూలు ఇప్పుడు కిలోమీటర్ల కొద్దీ పెరిగిపోతున్నాయి. మరోవైపు ఏటీఎంలలో ఎంత డబ్బు పెట్టినా ఖాళీ అయిపోతోంది. దీంతో.. ప్రభుత్వం ఒక వ్యక్తి తన ఖాతా నుంచి 60 డాలర్లకు మించి ఎక్కువ డ్రా చేసుకోకూడదన్న ఆంక్షలు విధించాయి.

దీంతో.. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నా.. వాటిని డ్రా చేసుకోలేని దారుణమైన పరిస్థితుల్లో గ్రీస్‌ ప్రజానీకం చిక్కుకుపోయింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక సంస్థ ఐపీ పెడితేనే ప్రభావం భారీగా ఉంటుంది. మరి.. ఒక దేశమే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో మరెన్ని ఆరాచకాలు నెలకొంటాయో..?