Begin typing your search above and press return to search.

కవితమ్మ పదవి కోసం ఆ ప్రాజెక్టును వదిలేస్తున్నారా?

By:  Tupaki Desk   |   6 July 2015 10:07 AM GMT
కవితమ్మ పదవి కోసం ఆ ప్రాజెక్టును వదిలేస్తున్నారా?
X
దివంగత నేత వైఎస్‌ హయాంలో చేపట్టిన ప్రాణహిత.. చేవెళ్ల ప్రాజెక్టును అటకమీద ఎక్కించే విషయాన్ని ఓపెన్‌గా చెప్పేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు విరుచుకుపడుతున్నారు.

ఇదంతా కూడా బీజేపీకి అనుకూలంగా ఉండేందుకు.. తన కుమార్తెకు కేంద్రమంత్రి పదవి ఇప్పించుకునేందుకు ఇలాంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ప్రాణహిత.. చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయని.. అలాంటిది ఇప్పుడు అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరెడ్డి గుర్తు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రాణహిత.. చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర సర్కారు కూడా అనుమతులు ఇచ్చిందని.. అలాంటిది ఇప్పుడు మాత్రం ఆ ప్రాజెక్టు సాధ్యం కాదని చెప్పటం వెనుక కుట ఉందని చెప్పారు. ఇదంతా కూడా.. కాంగ్రెస్‌కు పేరు రాకుండా చేయాలన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. తన కుమార్తె కవితమ్మకు కేంద్రమంత్రి పదవి ఇప్పించుకునేందుకు బీజేపీతో సఖ్యతగా ఉండాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్‌.. ఈ ప్రాజెక్టును పక్కన పెట్టటం ద్వారా మహారాష్ట్ర బీజేపీ సర్కారుకు లబ్థి చేకూరుస్తున్నారని మండిపడ్డారు.