Begin typing your search above and press return to search.

రాజధానిలో మల్లె గుభాళింపులు మరికొన్నాళ్లు..

By:  Tupaki Desk   |   29 Jun 2015 11:11 AM GMT
రాజధానిలో మల్లె గుభాళింపులు మరికొన్నాళ్లు..
X
వేసవి కాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా ముక్కుపుటాలు అదరగొట్టేలా మల్లెల గుభాళింపులే. ఈ గుభాళింపులన్నీమనకు ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నారు.. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన అమరావతి నుంచే! ఇక్కడ ఎక్కడ చూసినా మనకు మల్లె తోటలు విరివిగా కనిపిస్తాయి. ఇప్పుడు కూడా అక్కడ మల్లె తోటలు ఉన్నాయి. తోటలో మల్లెపూలు ఉన్నాయి. దీనికితోడు, ఇప్పటి వరకు 30 మంది మల్లె రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. పంటలు పూర్తయిన భూములను అప్పగించాలని, వాటిని చదును చేసేస్తామని అధికారులు చెబుతుండడంతో మల్లె రైతులు ఆందోళన చెందుతున్నారు.

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించేటప్పుడు మాత్రమే మల్లె తోటల జోలికి వస్తామని, అప్పుడు మాత్రమే వాటిని తొలగిస్తామని, అప్పటి వరకు మల్లె సాగును యధేచ్ఛగా చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వారికి భరోసా ఇస్తోంది. రైతులు అపోహలకు గురి కావద్దని, ఇప్పుడు చెక్కులు తీసుకున్నా.. డబ్బులు తీసుకున్నారన్న కారణంతో మల్లె తోటలను ధ్వంసం చేసేది లేదని భరోసా ఇస్తున్నారు.

ఇప్పటికే కొంతమంది మల్లె రైతులు చెక్కులు తీసుకున్నారు. మరికొంతమంది తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. మిగిలిన వారిలో మాత్రం ఆందోళన నెలకొంది. ఇప్పుడు తోటలు పంట మీద ఉన్నందున చెక్కులు తీసుకుంటే స్వాధీనం చేసేసుకుంటుందనే ఆందోళన ఉంది. దాంతో భూ సమీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వారికి భరోసా ఇచ్చింది. పంట పూర్తయిన తర్వాత భూములు స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేసింది.