Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ : దోచేయ్‌

By:  Tupaki Desk   |   24 April 2015 12:22 PM GMT
సినిమా రివ్యూ :  దోచేయ్‌
X
రివ్యూ: దోచేయ్‌

రేటింగ్‌: 2.75 /5

నటీనటులు: అక్కినేని నాగచైతన్య, కృతీ సనన్‌, రావు రమేష్‌, రవిబాబు, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, వైవా హర్ష తదితరులు
సంగీతం: సన్నీ ఎమ్‌.ఆర్‌
ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ప్రసాద్‌
నిర్మాత : బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
కథ, కథనం, దర్శకత్వం: సుధీర్‌ వర్మ

స్వామిరారా లాంటి సర్‌ప్రైజ్‌ హిట్టుతో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు, అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన ప్రొడ్యూసర్‌.. మంచి ఫాలోయింగ్‌ ఉన్న సక్సెస్‌పుల్‌ హీరో.. వీటన్నింటికీ తోడు ఆసక్తి రేపే ప్రోమోలు.. దోచేయ్‌ మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకునేలా చేశాయి. మరి దోచెయ్‌ ఆ అంచనాల్ని అందుకుందా? ప్రేక్షకుల మదిని దోచుకుందా.?

కథ:
ఫ్రెండ్స్‌తో కలిసి ఇంటలిజెంట్‌గా దొంగతనాలు చేసి చెల్లిని ఎంబీబీఎస్‌ చదివిస్తుంటాడు చందు (నాగచైతన్య). అతడి తండ్రి చెయ్యని నేరానికి జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి ఆపరేషన్‌ చేయించడానికి డబ్బు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో చందుకు అనుకోకుండా రెండున్నర కోట్ల రూపాయలు దొరుకుతాయి. ఆ డబ్బుతో తండ్రిని జైలు నుంచి బయటికి కూడా తేవాలన్న ప్రయత్నంలో ఉంటాడు చందు. ఐతే ఆ డబ్బు దొంగతనం చేయించిన ముఠా నాయకుడు(పోసాని)తో పాటు సీఐ (రవిబాబు) చందు వెంటపడతారు. మరి చందు వాళ్లిద్దరినీ ఎలా బోల్తా కొట్టించి ఎలా బయటపడ్డాడన్నది మిగతా కథ.

కథనం:

ఇంతకుముందు ఏ అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చిన వాళ్లను 'స్వామిరారా'తో సర్‌ప్రైజ్‌ చేశాడు సుధీర్‌ వర్మ. అందులో అతడి బ్రిలియన్స్‌ చూసి 'దోచేయ్‌' మీద అంచనాలు భారీగా పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ ఈసారి సుధీర్‌ ఆ రేంజిలో బ్రిలియన్స్‌ చూపించలేదు కానీ.. ప్రస్తుత ట్రెండుకు తగ్గట్లు ఎంటర్టైన్మెంటుకు మాత్రం ఢోకా లేకుండా చూసుకున్నాడు.
ఎన్నో లిమిటేషన్స్‌ మధ్య 'స్వామిరారా'ను అంత బాగా తీసిన సుధీర్‌.. అన్ని వనరులూ ఉన్నపుడు వాటిని వాడుకుని ఇంకా మంచి ఔట్‌పుట్‌ ఇవ్వాలని ఆశిస్తాం కాబట్టి కొంచెం నిరాశ తప్పదు. ప్రథమార్ధంలో కొన్ని చమక్కులతో.. రేసుగుర్రం తరహాలో చివరి అరగంట లాజిక్‌కు అందని కామెడీతో బాగా నవ్వులు పండించిన సుధీర్‌.. మధ్యలో బండి కొంచెం నెమ్మదిగా నడిపించాడు. మధ్యలో సినిమా కొంచెం స్లో అనిపించినా.. చివరి అరగంట మళ్లీ కామెడీతో ప్రేక్షకుల మనసు దోచాడు సుధీర్‌.
చిన్నప్పుడే తండ్రి అన్యాయంగా జైలు పాలవుతాడు. చెల్లెలి చదువు కోసం అన్నయ్య దొంగగా మారతాడు. చివరికి తండ్రిని జైలుపాలు చేసిన విలన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాడు. పాత చింతకాయ పచ్చడి కథ ఇది. ఐతే కథనంలో మాత్రం సుధీర్‌ కొత్తదనం చూపించాడు. పోసానిని విలన్ని చేయడంలోనే డైరెక్టర్‌ ఉద్దేశమేంటో అర్థమైపోతుంది. ప్రతి సన్నివేశంలోనూ వినోదం పండించడమే లక్ష్యంగా చేసుకున్నాడు. కథనం కొంచెం తికమకగా.. లాజిక్‌కు దూరంగా సాగినప్పటికీ వినోదానికి ఢోకా లేపోవడంతో ప్రేక్షకుడికి బోర్‌ కొట్టదు.
స్వామిరారాలో నిఖిల్‌ అండ్‌ కో చేసిన బ్రిలియంట్‌ రాబరీ ట్రిక్స్‌ చూశాక.. దోచేయ్‌లో చైతూ చేసే ట్రిక్స్‌ మామూలుగా అనిపిస్తాయి. అయితే, ఆ సినిమా చూడని వారిని ఇవి బాగానే ఆకట్టుకుంటాయి. హీరో పరిచయం తర్వాత హీరోయిన్‌తో వచ్చే సన్నివేశాలు చిలిపిగా ఉన్నాయి. కాకపోతే హీరోయిన్‌ను స్మోకర్‌గా చూపించడం యూత్‌కు నచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చదు. కాకపోతే ఈ కాలానికి దగ్గరగానే ఉంది మరి. హీరో చివర్లో సీఐని, విలన్‌ని బోల్తా కొట్టించే తీరు చూస్తే.. అంతటి ఇంటలిజెంట్‌.. అప్పటిదాకా ఏం చేశాడు, మధ్యలో అంత సిల్లీగా ఎలా బిహేవ్‌ చేశాడని ఆశ్చర్యం వేస్తుంది. ఐతే లాజిక్‌ పక్కనబెడితే హీరో-సీఐ మధ్య జరిగే టామ్‌ అండ్‌ జెర్రీ ఎపిసోడ్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఈ ఎపిసోడ్‌లో కామెడీ బాగా పండింది. చివర్లో పోసాని ఎపిసోడ్‌ కూడా కొంచెం సిల్లీగా అనిపించినా నవ్విస్తుంది. బుల్లెట్‌ బాబుగా బ్రహ్మానందం, కోర్టు సీన్‌లో సప్తగిరి కామెడీ అదరగొట్టారు. అప్పటిదాకా జరిగిందానికి, చివరి అరగంట జరిగే ఎపిసోడ్‌కు ముడిపెట్టి చూస్తే కష్టమే కాని, నవ్వులకు మాత్రం ఢోకా లేదు. ఇక సినిమాను నిలబెట్టేది ఈ కామెడీనే.

నటీనటులు:

నాగచైతన్య మామూలుగానే సీరియస్‌ క్యారెక్టర్లకు బాగా సూటవుతాడు కాబట్టి.. చందుగా ఇంటలిజెంట్‌ దొంగ పాత్రకు ఓకే అనిపించాడు. ఈ క్యారెక్టర్‌ను ఈజీగా చేసుకెళ్లిపోయాడు. నటన విషయంలో ఎక్కువ కష్టపెట్టే పాత్రేమీ కాదిది. లుక్‌ విషయంలో, ఫైట్లు, డ్యాన్సుల విషయంలో ఈసారి భిన్నంగా కనిపించాడు. 1 సినిమాలో కృతి సనన్‌ను చూసిన కళ్లతో దోచేయ్‌లో ఆమెను చూడటం కష్టం. రియల్టీ టచ్‌ ఉండటంతో ఈ రోల్‌ నచ్చడం నచ్చకపోవడం అనేది 50-50గా ఉంటుంది. పోసాని తన వంతుగా బాగానే నవ్వించాడు. కానీ అతణ్ని విలన్‌ అంటే మాత్రం మనసొప్పుకోదు. అందుకే హీరో ఫ్లాష్‌ బ్యాక్‌ కాస్త తేలిపోయింది. బ్రహ్మి.. దుబాయ్‌ శీనులో ఎమ్మెస్‌ను గుర్తుకు తెచ్చినా బాగానే నవ్వించాడు. బ్రహ్మి వేసిన బుల్లెట్‌ బాబు క్యారెక్టర్‌తో సుధీర్‌.. ఆడియో ఫంక్షన్లు జరిగే తీరుపై బాగానే సెటైర్లు వేశాడు. రవిబాబు ఆకట్టుకున్నాడు. హీరో ఫ్రెండ్స్‌ బ్యాచ్‌లో కనిపించే ప్రవీణ్‌, సత్య ఓకే. లన్‌ అసిస్టెంట్లుగా హర్ష, ఇంకో అబ్బాయి కొంచెం నవ్వించారు.

సాంకేతిక వర్గం:

సన్నీ ఎం.ఆర్‌. పాటలు సోసోగా అనిపిస్తాయి. గుర్తుండి వెంటాడే పాటలేవీ లేవు కానీ.. సినిమాకు సూటయ్యే పాటలు, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చాడు. పాటల కంటే కూడా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఓ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌కు సరిగ్గా సూటయ్యేలా ఉంది ఆర్‌ఆర్‌. రిచర్డ్‌ ప్రసాద్‌ ఛాయాగ్రహణం ఓకే. ఛేజ్‌ సీక్వెన్స్‌లో, యాక్షన్‌ సీన్స్‌లో అతడి పనితనం కనిపిస్తుంది. సినిమాను చాలా ట్రిమ్‌ చేయాల్సి ఉన్నా.. ఎడిటర్‌ కత్తెర పదును చూపించలేదు. సెకండాఫ్‌లో లాగ్‌ ఎక్కువైన ఫీలింగ్‌ కలుగుతుంది. బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మాణంలో వచ్చిన సినిమా కాబట్టి ప్రొడక్షన్‌ వాల్యూస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా రిచ్‌గా తెరకెక్కింది. స్వామిరారాతో పోలిస్తే దోచేయ్‌ కథాకథనాలు అంత రిఫ్రెషింగ్‌గా అనిపించకపోయినా.. ఈ తరం ప్రేక్షకులు ఆశించే వినోదాన్నివ్వడంలో సుధీర్‌ సక్సెస్‌ అయ్యాడు.

చివరిగా... కామెడీయే మీ మొటో అయితే, దోచెయ్‌ను ధియేటర్‌లో ఒక్కసారి దోచుకోవచ్చు