Begin typing your search above and press return to search.

అలా అయితే నితిన్‌ హీరో అయ్యేవాడా?

By:  Tupaki Desk   |   4 July 2015 6:43 AM GMT
అలా అయితే నితిన్‌ హీరో అయ్యేవాడా?
X
టాలీవుడ్‌లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చే వారసులదే రాజ్యం అనే విమర్శలపై సమాధానమిచ్చాడు దిల్‌ రాజు. జనాలకు ఈ విషయంలో తప్పుడు అభిప్రాయం ఉందని.. ఇక్కడ టాలెంట్‌కే ప్రాధాన్యం అని చెప్పాడు దిల్‌ రాజు. ''ఈ విమర్శలతో నేను ఏకీభవించను. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు ఎంత పెద్ద దర్శకులు. కానీ వాళ్ల అబ్బాయిలు హీరోలుగా నిలదొక్కుకోగలిగారా? ఎక్కడైనా ప్రతిభకే ప్రాధాన్యం. తెలంగాణ వాళ్లను సినిమా రంగం తొక్కేస్తుంది అన్న అభిప్రాయంతో కూడా నేను ఏకీభవించను. అదే నిజమైతే నితిన్‌ అంత పెద్ద హీరో ఎలా అయ్యాడు? ఈ విమర్శలే నిజమైతే నితిన్‌ లాంటి హీరో మనకు పరిచయం అయ్యేవాడే కాదు'' అన్నాడు దిల్‌ రాజు.

తన ప్రతి సినిమాలోనూ ఎంతో కొంత మంచి చెప్పాలని ప్రయత్నిస్తానని.. కేరింత కూడా ఆ కోవలోకే చెందుతుందని చెప్పిన దిల్‌ రాజు.. తాను తీసిన సినిమాల్లో బొమ్మరిల్లు, ఆర్య, కొత్త బంగారు లోకం ప్రత్యేకమైనవని చెప్పాడు. నిర్మాతల దగ్గర పెట్టుబడి ఉంటే సరిపోదని.. మంచి కథతో కూడిన సినిమాను ఎంచుకోవడం అన్నింటికంటే ముఖ్యమైందని చెప్పాడు రాజు. ప్రస్తుతం తన బేనర్లో సాయిధరమ్‌ తేజ్‌తో 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' పూర్తయ్యే దశలో ఉందని.. సునీల్‌ సినిమా కూడా షూటింగ్‌ జరుపుకుంటోందని.. తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా నిర్మాతగా సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నానని చెప్పాడు దిల్‌ రాజు.