Begin typing your search above and press return to search.

డీఎస్‌ది ఆత్మహత్యా సదృశమేనా!?

By:  Tupaki Desk   |   1 July 2015 5:30 PM GMT
డీఎస్‌ది ఆత్మహత్యా సదృశమేనా!?
X
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డి.శ్రీనివాస్‌ తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి! కేసీఆర్‌ నాయకత్వంలో ఆయన పని చేయడానికి అంగీకరించడాన్ని ఏవిధంగా జీర్ణించుకోవాలి! డి.శ్రీనివాస్‌ వంటి వ్యక్తి కేసీఆర్‌ ఆధిపత్యానికి లంగిపోతే ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పుట్టగతులు లేనట్లేనా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్‌ నాయకులను తొలిచేస్తున్నాయి.

డీఎస్‌ ఆత్మహత్యా సదృశ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని, ఆకుల లలితకు ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో తనను సంప్రదించలేదని ఆయన కాంగ్రెస్‌ను విడిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం ఆయన హోదాకు తగదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ రెండింటికీ మించి మరొక కారణం డీఎస్‌ కాంగ్రెస్‌ను వీడడానికి కారణమైందని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే రెడ్ల ఆధిపత్యం. తెలంగాణలో అయితే ఈ పరిణామం మరీ ఎక్కువ. ఇప్పటికీ ఆ పార్టీలో రెడ్లదే ఆధిపత్యం. తాజాగా కొప్పుల రాజు వచ్చిన తర్వాత ఎస్సీల ఆధిపత్యమూ పెరుగుతోంది. అంటే భవిష్యత్తులో ఇటు రెడ్లు, అటు ఎస్సీల ఆధిపత్యమే కొనసాగనుంది. బీసీల ఆధిపత్యానికి గండి పడనుంది. ఈ విషయం ఇటీవలి పలు సందర్భాల్లో రుజువైంది. అధికారంలో లేని ఇప్పుడే రెడ్లు, ఎస్సీల ఆధిపత్యం కొనసాగితే ఇక అధికారంలోకి వస్తే బీసీలకు తెలంగాణలో పట్టగతులు కూడా ఉండవని డీఎస్‌ భావించారని చెబుతున్నారు. రెడ్ల ఆధిపత్యంలో కొనసాగే పార్టీలో తనకు చోటు ఉండదని కూడా ఆయన భావించారంటున్నారు.

అయితే, కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటే అధిష్ఠానాన్ని ఆయన ఏదో విధంగా ఒప్పించే సామర్థ్యం ఆయనకు ఉంది. కానీ, ఇప్పుడు కేసీఆర్‌ నాయకత్వంలోకి వెళ్లిన తర్వాత ఆయన ఏం చెబితే దానికి తలగ్గాల్సిందేనని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎస్‌ కూడా మరో కేకేలా మారక తప్పదని చెబుతున్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం రావచ్చు. కానీ, ఆయనకంటూ గుర్తింపు లేకుండాపోతుందని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లోకి మరీ ముఖ్యంగా కేసీఆర్‌ నాయకత్వంలో పని చేయడానికి వెళ్లడం ద్వారా డీఎస్‌ తన ప్రత్యేకతను, గుర్తింపును పోగొట్టుకున్నట్లేనని, ముఖ్యమంత్రి కావాలనుకునే ఆయన ఆశలకు కూడా నీళ్లు వదులుకున్నట్లేనని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో ఉంటే సీనియర్‌ నాయకుడిగా అధిష్ఠానాన్ని ఎప్పుడో అప్పుడు ఒప్పించే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఇక ఆయన అన్ని అవకాశాలనూ కోల్పోయినట్లేనని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడం డీఎస్‌కు ఆత్మహత్యా సదృశంగా మారనుందని వివరిస్తున్నారు.