Begin typing your search above and press return to search.

డీఎస్‌.. బీసీలకు ఎలా న్యాయం చేస్తావు!?

By:  Tupaki Desk   |   2 July 2015 12:30 PM GMT
డీఎస్‌.. బీసీలకు ఎలా న్యాయం చేస్తావు!?
X
కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందనేది కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టి కారెక్కబోతున్న ధర్మపురి శ్రీనివాస్‌ ఆవేదన. కాంగ్రెస్‌లో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయన్నది కూడా అంతర్గతంగా ఉన్న ఆందోళన. అందుకే ఆయన టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాని అంతర్గతంగా చెబుతున్నారు. మరి టీఆర్‌ఎస్‌లో ఆయన బీసీలకు ఎలా న్యాయం చేస్తారని కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి తెలంగాణలో బీసీల జనాభాయే అధికం. అందుకే గతంలో కూడా కాంగ్రెస్‌, టీడీపీలు తెలంగాణ నుంచి బీసీ వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవి. గతంలో డీఎస్‌కు మంత్రి పదవి కూడా ఆ ప్రాతిపదికనే వచ్చింది. మరి, ఇప్పుడు కేసీఆర్‌ మంత్రివర్గంలో బీసీల పరిస్థితి ఏమిటని కాంగ్రెస్‌ నాయకులు నిలదీస్తున్నారు. కేసీఆర్‌తో కలిపి మంత్రివర్గంలో 18 మంది ఉన్నారు. వీరిలో వెలమలు నలుగురు, రెడ్లు ఆరుగురు.. కమ్మ ఒకళ్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఇక్కడికి 11 పోతే.. ఎస్సీల తరఫున కడియం శ్రీహరి, ముస్లిం తరఫున మహమూద్‌ అలీ, ఎస్టీల తరఫున చందూలాల్‌ ఉన్నారని గుర్తు చేస్తున్నారు. దీంతో మంత్రుల సంఖ్య 14 అయింది. ఇక మిగిలింది నలుగురని. వీళ్లు నలుగురూ బీసీలు ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుత టీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలో కూడా రెడ్లు, వెలమల ఆధిపత్యమే కొనసాగుతోందని, ఆ తర్వాతి స్థానమే బీసీలదని కాంగ్రెస్‌ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను విడిచి టీఆర్‌ఎస్‌లోకి రావడం ద్వారా బీసీలకు ఆయన ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.