Begin typing your search above and press return to search.

ఆంధ్రా వైబ్రెంట్‌ కోసం 'ఒకరికే'' రూ.70కోట్లు?

By:  Tupaki Desk   |   2 July 2015 4:56 AM GMT
ఆంధ్రా వైబ్రెంట్‌ కోసం ఒకరికే రూ.70కోట్లు?
X
రాజకీయ విమర్శలు తప్పించి.. కుంభకోణాలకు సంబంధించి గత 13 నెలల్లో అవకాశం ఇవ్వని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పటడుగు వేశారా? అన్న సందేహం వచ్చేలా ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

గుజరాత్‌ వైబ్రెంట్‌ మాదిరే.. విదేశీ పెట్టుబడిదారుల్ని ఆహ్వానించి.. వారి చేత పెట్టుబడుల కోసం ప్రయత్నించేందుకు ఆంధ్రప్రదేశ్‌ వైబ్రెంట్‌ పేరిట ఒక కార్యక్రమాన్ని ఏపీ సర్కారు ఈ ఏడాదిలోనే నిర్వహించాలని భావిస్తోంది. దీని నిర్వహణ బాధ్యతల్ని ఒక ఆంగ్ల పత్రికకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ అప్పగించినట్లుగా చెబుతున్నారు. ఇందుకోసం సదరు పత్రికకు ఏకంగా రూ.70కోట్లు ఇవ్వటం ఇప్పుడు కలకలం రేపుతోంది.

పారిశ్రామికవేత్తల్ని ఏపీకి తీసుకొచ్చి.. కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించటానికి.. భారీగా ప్రచారం చేయటానికి వీలుగా రూ.70కోట్లు ఖర్చు పెట్టనుండటంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌కే రూ.70కోట్లు అయితే.. సదరు అతిధులు రావటానికి.. బస చేయటానికి మరెంత ఖర్చు అవుతుందన్నది ఒక ప్రశ్న.

ఇంత భారీగా ఖర్చు పెట్టి ప్రోగ్రాం చేస్తే.. ఎంత భారీగా పెట్టుబడులు వస్తాయన్న దానిపై నమ్మకం లేని పరిస్థితి. అయినా.. ఇలాంటి కార్యక్రమాల్ని ప్రభుత్వమే నిర్వహించినా రూ.10 లేదంటే.. రూ.20కోట్లు దాటదని.. అలాంటిది రూ.70కోట్లు ఒక మీడియా సంస్థకు ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్న సందేహం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే.. ఇంత భారీ ఖర్చుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నతోపాటు.. ఇంత భారీగా ఖర్చు పెట్టినా.. ఫలితం ఎలా ఉంటుందో తెలీదన్న మాట వినిపిస్తోంది. తప్పుల మీద నిలదీసే వ్యక్తి తప్పులు చేయటాన్ని ప్రజలు క్షమించరన్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోతున్నారా?