Begin typing your search above and press return to search.

అతితెలివే అనురాధ కొంప ముంచిందా?

By:  Tupaki Desk   |   23 May 2015 9:50 AM GMT
అతితెలివే అనురాధ కొంప ముంచిందా?
X
అధినేతతోనే ఆటలు ఆడటం.. తెలివితేటలు ప్రదర్శించటం లాంటివి చేస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా వ్యవహరిస్తారన్న దానికి ఆయనో శాంపిల్‌ చర్య ప్రదర్శించారు. విజయవాడ మేయర్‌గా అందరిని ఆకట్టుకొని.. తెలుగుదేశం పార్టీ విధేయురాలిగా పేరు పొందిన అనురాధకు.. పోన్లే అని ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వటం తెలిసిందే.

పదేళ్లు విపక్షంలో ఉండి.. సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టలో పదవుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వారు చాలామందే ఉన్నారు. ఇలాంటి సమయాల్లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలే కానీ.. అతితెలివికి పోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అనురాధకు అర్థమై ఉంటుంది. గవర్నర్‌ చేత నామినేట్‌ అయ్యే ఎమ్మెల్సీల కోటాలో మొదట అనురాధను ఎంపిక చేశారు. ఈ పదవి ఆరేళ్లు ఉంటుంది.

అదే సమయంలో.. దళిత నేత జూపూడి ప్రభాకర్‌కు ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని భావించారు. ఈ పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది. అయితే.. జూపూడికి తెలంగాణ రాష్ట్రంలో ఓటుహక్కు ఉండటంతో ఆయనకు.. ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యే ఛాన్స్‌ లేదు. దీంతో.. గవర్నర్‌ కోటాలో ఉన్న అనురాధను తీసుకొచ్చి జూపూడి ప్లేస్‌లో.. జూపూడిని అనురాధకు కేటాయించిన కోటాలో ఉంచాలని టీడీపీ అధినేత నిర్ణయించారు.

చేతికి వచ్చిన ఆరేళ్ల పదవీ కాలాన్ని చేజార్చుకునేందుకు ససేమిరా అన్న అనురాధ తెలివికిపోయి.. ఎమ్మెల్యే కోటా కింద నామినేషన్‌ దాఖలు చేసేందుకు ససేమిరా అన్నారు. దీనికి ఆమె చూపించి సాంకేతికకారణం ఏమిటంటే.. గవర్నర్‌ కోటా కింద నామినేట్‌ కావటానికి అవకాశం ఉన్న నేపథ్యంలో తాను పత్రాలు సిద్ధం చేసుకోలేదని.. ఈ కారణంగా నామినేషన్‌ వేయటం ఇబ్బంది అవుతుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

అనురాధ ప్రదర్శించిన తెలివితేటలు మీడియాలో ప్రముఖంగా రావటం.. అధినేత చంద్రబాబుకు ఆగ్రహం చెందటం ఒకేసారి జరిగిపోయాయి. పోన్లే అని పిలిచి పదవి ఇస్తే.. తన దగ్గరే తెలివితేటలు ప్రదర్శించటమా అని ఫీలైన బాబు.. అనురాధకు ఎమ్మెల్సీ అవకాశమే లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లలో ఆమె పేరును తీసేసిన బాబు.. ఆమెకు బదులుగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్రకు అవకాశం ఇవ్వాలని డిసైడ్‌ అయ్యారు.

మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ కావాల్సిన అనురాధ తన తెలివితేటల కారణంగా..అధినేత ఆగ్రహానికి గురి అయితే.. అస్సలు ఎమ్మెల్సీ రేసులోనే లేని బీదా రవిచంద్ర సుడి తిరిగిపోయి.. అధినేత అనుగ్రహంతో ఎమ్మెల్సీ కానున్నారు. వచ్చిన అవకాశాన్ని బుద్ధిగా తలూపాలే తప్పించి.. తెలివితేటలు ప్రదర్శిస్తే ఏమవుతుందన్న దానికి అనురాధ ఉదంతం ఒక పెద్ద ఉదాహరణగా మిగిలిపోతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.