Begin typing your search above and press return to search.

టీఎస్‌లో పెంచిన తర్వాతే బాబు పెంచుతారట!

By:  Tupaki Desk   |   25 May 2015 6:28 AM GMT
టీఎస్‌లో పెంచిన తర్వాతే బాబు పెంచుతారట!
X
ఆర్టీసీ చార్జీలు పెరుగడం ఖాయం.. ఇప్పటికే మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తలతో జనాలు కూడా మానసికంగా భారానికి సిద్ధం అవుతున్నారు. కార్మికుల జీతాలు పెరగడం, డీజిల్‌ ధరలలో పెరుగుదల.. ఇప్పటికే ఆర్టీసీకి ఉన్న కష్టాల ఫలితంగా చార్జీలు పెరగడం ఖాయమైంది. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో మరో మార్గాన్వేషణ చేయకుండా.. చార్జీల పెరుగుదలే మేలన్న భావనలో ఉంది.

ఇలాంటి నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు ఏ స్థాయిలో పెరుగుతాయి? అనేదే ఆసక్తికరమైన అంశం. పెంపుదల అయితే గ్యారెంటీనే! ఇప్పుడు మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆర్టీసీ చార్జీల పెంపు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణను మోడల్‌గా తీసుకోవాలని అనుకొంటున్నాడట!

ఇటీవల ఏపీ ఆర్ట్ణీసీ కార్మికులతో పాటు తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కూడా జీతాలు పెరిగాయి. ఇక డీజిల్‌ ధరల పెంపు అనేది ఉభయ రాష్ట్రాల రవాణా సంస్థపైనా ప్రభావంచూపించేదే! కాబట్టి పెంపుదల రెండు చోట్లా తప్పనిసరి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పెంపుదల ఆలోచనను బయటపెట్టింది. దీంతో ఏపీ సీఎం బాబుగారు ఈ విషయంలో ఆచితూచి స్పందించాలని భావిస్తున్నారట.

ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీల పెంపు విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకొంటే దాన్ని అనుసరించి ఏపీలో కూడా పెంచాలని... దీని ద్వారా తాము కొంత సేఫ్‌ జోన్‌లో ఉన్నట్టవుతుందని ఆయన లెక్కలేసుకొంటున్నారట. అదీ కథ!