Begin typing your search above and press return to search.

మోడీతో చంద్రబాబు పోటీ

By:  Tupaki Desk   |   3 July 2015 11:19 AM GMT
మోడీతో చంద్రబాబు పోటీ
X
నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రధాన మంత్రే కావొచ్చు... కానీ, అంతకుముందు ఆయన గుజరాత్ కు ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు. గుజరాత్ ను దేశానికే తలమానికంగా అభివృద్ధి చేశారని చెబుతుంటారు. గుజరాత్ మోడల్ అంటూ మొన్నటి ఎన్నికల ప్రచారంలోనూ ప్రతి చోటా చెప్పారు. గుజరాత్ లో నౌకరవాణా అత్యంత కీలక రంగం.... ఇప్పుడు గుజరాత్ కు సీఎంగా ఆనంది పటేల్ ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర ప్రగతి విషయంలో మోడీ ఇప్పటికే ఒక కన్నేసి ఉంచుతారని చెబుతుంటారు. అలాంటి గుజరాత్ వ్యాపారానికి పోటీగా మారేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. ఆ పోటీనిచ్చే కార్యక్రమంలో భాగంగా ఆయన ఏపీ ప్లస్సు పాయింట్లను కస్టమర్లకు వివరించి ఆకట్టుకుంటున్నారు. అందులోనూ అతిపెద్ద కస్టమర్లయిన చైనా వ్యాపారులను చంద్రబాబు ఆకర్షిస్తున్నారు. గుజారత్ వరకు మీరు వెళ్లడమెందుకు..? అంతకంటే ముందే మేమున్నాం... మా ఓడరేవుల నుంచి రవాణా చేసుకోండంటూ ప్రతిపాదిస్తున్నారు.

ఏపీలో ఇప్పుడున్న రేవులతోపాటు మరో మూడు ఓడరేవులను అభివృద్ధి చేయనున్నారు. ఏపీ భౌగోళికంగా దక్షిణాసియా దేశాలతో చైనా వాణిజ్య సంబంధాలకు అనువుగా ఉంటుంది. చైనాకు చెందిన దలియన్ వాండా గ్రూపునకు చెందిన ఐదుగురు సభ్యుల బృందం తాజాగా చంద్రబాబును కలిస్తే వారికి ఏపీ అధికారులు రాష్ట్రంలో వసతులు, పెట్టుబడుల అవకాశాలను ఏపీ అధికారులు వివరించారు. దక్షిణాసియా దేశాలతో వ్యాపారానికి చైనాకు ఏపీ అనువైన కేంద్రమని, వాణిజ్య పరికరాలు, సరకును గుజరాత్ రాష్ట్రం కంటే ఆరు రోజుల ముందుగా ఇక్కడి తీరానికి చేర్చవచ్చని స్వయంగా చంద్రబాబు వారికి వివరించారట. ఈ లాజిక్ వారికి నచ్చి లాజిస్టిక్స్ కు గుజరాత్ కంటే ఏపీ బెటర్ అని డిసైడయ్యారట. అంతేకాదు... అమరావతిలో బహుళ అంతస్థుల భవనాలు, పోర్టుల నిర్మాణానికీ చైనా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. దలియన్ వాండా గ్రూప్ సంస్థే రాజధానిలో బహుళ అంతస్థుల భవనాలు, పోర్టుల నిర్మాణానికి మేం సిద్ధమని చంద్రబాబుతో చెప్పింది. ఈ ప్రతిపాదనా పరిశీలనలో ఉంది.

ఈ సంగతి ఎలా ఉన్నా కానీ లాజిస్టిక్స్ విషయంలో దక్షిణాసియా దేశాలు ఏపీ ఓడరేవులను ఉపయోగించుకుంటే మాత్రం పైనున్న మహారాష్ట్ర, గుజరాత్ రేవులకు వ్యాపారం తగ్గడం ఖాయం. ఇక్కడ లాజిస్టిక్స్ ను భారీగా పెంచే ఉద్దేశంతోనే చంద్రబాబు అలా గుజరాత్ తో పోలిక చూపించారని... గుజరాత్ కంటే 6 గంటల ముందే ఇక్కడకు చేరువోచ్చని చెప్పారని తెలుస్తోంది. మొత్తానికి కొద్ది సంవత్సరాల్లో ఏపీని లాజిస్టిక్ హబ్ గా మార్చాలన్న చంద్రబాబు కలలు నిజమయ్యేలాగే ఉన్నాయి.