Begin typing your search above and press return to search.

ఏపీకి కొత్త మంత్రులు వచ్చేస్తున్నారు

By:  Tupaki Desk   |   8 July 2015 5:14 AM GMT
ఏపీకి కొత్త మంత్రులు వచ్చేస్తున్నారు
X
ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన పలువురు సీనియర్లు ఇప్పుడు మంత్రులు అయ్యేందుకు అవకాశం ఏర్పడింది. మరి.. ఈ నేపథ్యంలో ఏపీ క్యాబినెట్‌లోకి కొత్త మంత్రులు వస్తారా? ఎమ్మెల్సీగా ఎన్నికైన సీనియర్లకు మంత్రి పదవులు దక్కుతాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు జపాన్‌ పర్యటనకు ముందే మంత్రివర్గంలో మార్పులు.. చేర్పులపై బాబు సంకేతాలు ఇవ్వటంతో పాటు.. కొంత కసరత్తు కూడా జరిగిందని చెబుతున్నారు.

మరోవైపు.. ఏపీ సీఎం పుత్రరత్నం లోకేశ్‌.. ఏపీ మంత్రుల పని తీరుపై ఇప్పటికే అంతర్గత సర్వే ఒకటి చేయించారని.. అందులో ఆరుగురు మంత్రుల పని తీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని.. వారిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తే.. పార్టీలోని మిగిలిన వారు సైతం జాగ్రత్త పడతారని.. పనులపై దృష్టి పెడతారన్న వాదన ఉంది. ఇక.. మంత్రివర్గంలో ముస్లింలకు స్థానం కల్పించే విషయంపై ఇప్పటికే ఒత్తిడి ఉన్న నేపథ్యంలో మైనార్టీ విభాగానికి ఒక మంత్రిని ఏర్పాటు చేయటంతో పాటు.. పలు మంత్రి పదవుల్ని సీనియర్ల చేతికి అప్పగించాలని భావిస్తున్నారు.

ఈసారి మంత్రివర్గంలోకి తీసుకునే నేతలకు.. కొన్ని కీలక శాఖల్ని అప్పజెబుతారని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న పంచాయితీ నేపథ్యంలో.. కొన్ని శాఖలకు సంబంధించి ఏపీ తరఫున వాయిస్‌ చాలా వీక్‌గా ఉందన్న వాదన ఉంది. దాన్ని సరిదిద్దేందుకు పయ్యావుల కేశవ్‌.. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. లాంటి నేతలకు ఇవ్వాలన్న భావనలోఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన షరీఫ్‌కు మంత్రివర్గంలో మైనార్టీ మంత్రిగా స్థానం పక్కా అని చెబుతున్నారు. చూస్తుంటే.. జపాన్‌ పర్యటన ముగించి వచ్చిన తర్వాత ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.