Begin typing your search above and press return to search.

సెంటిమెంటు పిండుతున్న చంద్రబాబు!

By:  Tupaki Desk   |   24 May 2015 12:30 PM GMT
సెంటిమెంటు పిండుతున్న చంద్రబాబు!
X
ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారన్న సామెత చందంగా.. తన శిష్యుడు కేసీఆర్‌ రాజకీయ ఎత్తులను చూసిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు కూడా సెంటిమెంటును పిండుకోవాలని నిర్ణయించారు. తనదైన పాలనకు సెంటిమెంటును రంగరించి ఏపీ పీఠాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు కారణమైన కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న కోపాన్ని కొనసాగించాలని, వీలయితే మరింత పెంచాలని కంకణం కట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది రాష్ట్ర విభజన కారణంగానే. రాష్ట్ర విభజన జరగడం.. హైదరాబాద్‌ తెలంగాణకు పోవడం.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలి పవడం.. దానికితోడు లోటు రాష్ట్రం కావడంతో ఎన్నికలకు ముందు ఏపీ పరిస్థితి ఏమిటనే సందేహాలు నెలకొన్నాయి. దాంతో, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం తనకు ఉందని, తనను గెలిపిస్తే ఏపీని అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. అప్పట్లో ఏపీ ప్రజలు కాంగ్రెస్‌పై కోపంతో ఉన్నారు. రాష్ట్ర విభజనకు వైసీపీ కూడా సహకరించిందన్న ప్రచారానికితోడు మోదీ, పవన్‌ కల్యాణ్‌ ప్రభావంతో వైసీపీపై ప్రేమను తగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు నాయుడు మాత్రమే అభివృద్ధి చేయగలరన్న విశ్వాసంతో టీడీపీని గెలిపించారు.

ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు కనక ఈ సెంటిమెంటను వచ్చే పదేళ్లపాటు కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు. అప్పుడే టీడీపీ సురక్షితంగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. అందుకే, జూన్‌ రెండో తేదీన నవ నిర్మాణ దీక్షకు శ్రీకారం చుట్టారు. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని, అప్పటి వీడియోలను మరోసారి ప్రదర్శించి ఏపీ ప్రజల కోపాన్ని మరోసారి రెచ్చగొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏకంగా వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్థాయిలో రాష్ట్ర విభజన పరిణామాలను వివరించాలని స్పష్టం చేశారు. తద్వారా, కాంగ్రెస్‌ మీద కోపాన్ని మరింత పెంచి.. తనపై విశ్వసనీయతను మరోసారి చాటుకోవడమే చంద్రబాబు ధ్యేయంగా విశ్లేషకులు భావిస్తున్నారు