Begin typing your search above and press return to search.

''పెద్దాయన''ను బాబు ఇంటికి పంపిస్తున్నారా?

By:  Tupaki Desk   |   29 Jun 2015 6:50 AM GMT
పెద్దాయనను బాబు ఇంటికి పంపిస్తున్నారా?
X
ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ రాజకీయ కోణం చూపించకుండా.. తనకు దక్కిన స్థానానికి మరింత వన్నె తెస్తూ.. పెద్దల సభకు పెద్దన్నగా వ్యవహరించే పోస్ట్‌కి ఒక మర్యాదను.. గౌరవాన్ని తీసుకొచ్చిన నేత.. ఏపీ మండలి ఛైర్మన్‌ చక్రపాణి.

సుదీర్ఘ రాజకీయ నేతగా.. కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడైన చక్రపాణికి.. వైఎస్‌ హయాంలో ఏర్పాటు చేసిన మండలికి ఛైర్మన్‌గా నియమించారు. అప్పటి నుంచి ఆయన నిరాటంకంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఆయనకు రెండేళ్ల పదవీ కాలం ఉంది.

ఈ పరిస్థితుల్లో ఆయనను పదవి నుంచి తప్పించాలని భావిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ మండలి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న చక్రపాణిని.. గత 13 నెలలుగా కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఇదంతా తప్పనిసరి పరిస్థితుల్లోనే. ఎందుకంటే ఏపీ మండలిలో పెద్దఎత్తున కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉండటం.. అధికార తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం బలం లేని నేపథ్యంలో.. మండలి ఛైర్మన్‌ను మార్చే అంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టేశారు.

విభజన తర్వాత మండలిలో 50 ఎమ్మెల్సీ స్థానాలే ఉండేవి. కేంద్రం చేసిన మార్పుల కారణంగా ఇది కాస్తా 58కి పెరిగాయి. ప్రస్తుతం మండలిలో అధికార తెలుగుదేశం పార్టీకి మొత్తం 32 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మరో ఏడుగురు సభ్యుల మద్ధతు ఉంది.

ఈ నేపథ్యంలో మండలి ఛైర్మన్‌ మార్పు మీద చంద్రబాబు దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. పెద్దమనిషిగా అందరూ భావించే చక్రపాణితో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ.. తమ పార్టీకి చెందిన వ్యక్తిని ఉన్నత స్థానంలో ఉంచాలన్న తలంపులో చంద్రబాబు ఉన్నారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేతను మండలి ఛైర్మన్‌గా ఉంచటం చంద్రబాబుకు సుతారమూ ఇష్టం పడని పరిస్థితి.

ఈ నేపథ్యంలో తర్వాతి సమావేశాల్లోపు చక్రపాణిని ఛైర్మన్‌ పదవినుంచి తప్పుకోమని చంద్రబాబు చెప్పనున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఆయన కానీ తప్పుకోకపోతే.. బలవంతంగా అయినా తప్పుకునేలా చేస్తారని చెబుతున్నారు. అసెంబ్లీ స్పీకర్‌.. డిప్యూటీ స్పీకర్‌.. మండలిలో వైఎస్‌ ఛైర్మన్‌లు అంతా అగ్రవర్ణాలకు చెందిన వారుకావటంతో మండలి ఛైర్మన్‌ పదవిని బీసీ నేతకు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం మండలి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న చక్రపాణి సైతం బీసీ వర్గానికి చెందిన నేత కావటం.