Begin typing your search above and press return to search.

ఫోకస్‌: తమ్ముళ్లపైనే ఫోకస్‌

By:  Tupaki Desk   |   29 Jun 2015 6:05 AM GMT
ఫోకస్‌: తమ్ముళ్లపైనే ఫోకస్‌
X
అన్నయ్య పెన్నిధి అదే నాకు సన్నిధి! అన్న బావుంటే తమ్ముడు బావున్నట్టే. అన్న వెళ్లే దారిలోనే తమ్ముడికి ఛాన్సుంటుంది. ఒకవేళ అన్న పెద్ద హీరోనో, లేక దర్శకుడో, కనీసం క్యారెక్టర్‌ ఆర్టిస్టో.. ఏది అయినా అదే విభాగంలో తమ్ముడికి ఓ రాయి విసిరే ఛాన్సుంటుంది. లేదా ఆసక్తి ఉన్న విభాగంలో అవకాశం షురూ. అన్నకి ఉన్న పరిచయాలు ఇక్కడ ఉపయోగపడతాయి. తనకి ఉన్న పరిచయాలతో అన్నిటినీ మ్యానేజ్‌ చేసేయొచ్చు. నాలుగైదు సినిమాలతోనే ఆళ్లు ఈళ్లయ్యారు అన్న చందంగా, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు తమ్ముడు కూడా పెద్ద రేంజుకి వచ్చేస్తాడు. అయితే అన్ని సందర్భాల్లోనూ అరటి ఆకులో అన్నీ అమిరేయవు కాబట్టి కొన్నిసార్లు ఫెయిల్యూర్స్‌తో తెరవెనక్కి వెళ్లిపోవచ్చు కూడా.

మెగాస్టార్‌ ఫ్యామిలీతో మొదలు పెడితే చిరంజీవి క్రేజుతోనే తమ్ముడు పవన్‌ కూడా హీరో అయ్యాడు. ఆ తర్వాత సొంత ట్యాలెంటుతో నంబర్‌-1 స్థానానికి ఎదిగాడు పవన్‌. హీరో రవితేజ తమ్ముళ్లందరినీ పరిశ్రమలోకి తీసుకొచ్చాడు. వాళ్లంతా హీరోలు అవ్వకపోయినా జులాయి టైపు క్యారెక్టర్లు చేస్తూ కెరీర్‌ని సాగిస్తున్నారు. అలాగే నందమూరి వంశంలో, దగ్గుబాటి వంశంలో, అక్కినేని వంశంలో హీరోలు, నిర్మాతలు అన్నదమ్ములే. తమ హీరోల్ని ప్రమోట్‌ చేసుకోవడానికి అన్నలు, లేదా తండ్రులు పెట్టుబడులు పెట్టడం అన్నది ఇక్కడ ఆనవాయితీగా నడుస్తున్నదే. ఇదే తీరుగా తమ్ముడు సాయిరామ్‌ శంకర్‌ని ప్రమోట్‌ చేయడం కోసం పూరీ జగన్నాథ్‌ ఎంతగానో తపించాడు. ఇప్పటికీ తపిస్తూనే ఉన్నాడు. ఇలా సోదర బంధంతో సొంత కుటుంబం నుంచి హీరోల్ని ప్రమోట్‌ చేసుకుంటున్న తీరు మనకి బాగానే నడుస్తోంది.

అయితే ఓ మారు కోలీవుడ్‌ వెళితే అక్కడా ఆ సీన్‌ కనిపిస్తోంది. హీరో సూర్య వల్ల కార్తీ పెద్ద హీరో అయ్యాడు. ఈ ఇద్దరినీ బంధువు అయిన స్టూడియోగ్రీన్‌ జ్ఞానవేల్‌ రాజా ప్రమోట్‌ చేశాడు. అలాగే ధనుష్‌ని హీరోగా ప్రమోట్‌ చేసింది సెల్వరాఘవన్‌. తమ్ముడిని పెద్ద సూపర్‌స్టార్‌ని చేసిన ఘనత సెల్వదే. అలాగే హీరో ఆర్య తన తమ్ముడు సత్యని హీరోగా ప్రమోట్‌ చేయడానికి చేయని ప్రయత్నం లేదంటే నమ్మండి. అలాగే దర్శకుడు వెంకట్‌ ప్రభు తను ఏ సినిమా తీసినా అందులో తమ్ముడు ప్రేమ్‌జీ ఉండాల్సిందే. తనకంటూ ఓ క్యారెక్టర్‌ ఏదోలా క్రియేట్‌ చేస్తుంటాడు.

ఇప్పుడు అదే బాటలో కొరియోగ్రాఫర్‌ కం యాక్టర్‌ కం డైరెక్టర్‌ లారెన్స్‌ కూడా తమ్ముడిని ప్రమోట్‌ చేస్తున్నాడు. లారెన్స్‌ ప్రస్తుతం తమ్ముడు ఎల్విన్‌ని హీరోని చేయాలన్న సంకల్పంతో ఉన్నాడు. దానికోసం డెబ్యూ దర్శకుల కథల్ని వింటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తమ్ముడిని సూపర్‌స్టార్‌ని చేయడమే లక్ష్యంగా ప్లాన్స్‌ వేస్తున్నాడు. అలాగే జయం రవి - రాజా .. ఇద్దరూ అన్నదమ్ములు. తొలి సినిమా నుంచి ఈ ఇద్దరూ కలిసే నటిస్తున్నారు.

ఇలా తమ్ముళ్లను ప్రమోట్‌ చేయడం కోసం అన్నలు చాలా చేస్తున్నారు. తమ్ముడి కెరీర్‌ని నిలబెట్టడం కోసం బోలెడంత పెట్టుబడులు కూడా పెడుతున్నారు.