Begin typing your search above and press return to search.

అంత కండకావరమా; పోలీసు కుక్కలని ఊగిపోయాడు

By:  Tupaki Desk   |   29 Jun 2015 5:21 AM GMT
అంత కండకావరమా; పోలీసు కుక్కలని ఊగిపోయాడు
X
పార్టీల మధ్య పంచాయితీలు ఎన్ని అయినా ఉండొచ్చు. కొంతమంది అధికారులు తప్పు చేసి ఉండొచ్చు. అధికారపక్షానికి వంత పాడుతూ విధేయతను ప్రదర్శించి ఉండొచ్చు. అంతమాత్రానికే మరొకరు ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు కదా. తాజాగా పశ్చిమబెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆశిష్‌ మర్జిత్‌ బ్యాలెన్స్‌ కోల్పోయారు. పోలీసు శాఖ అధికారపక్షానికి తొత్తులా పని చేస్తుందంటూ ఆగ్రహంతో ఊగిపోతున్న ఆయన.. పోలీసుల్ని ఇష్టారాజ్యంగా తిట్టేస్తున్నారు.

వ్యక్తులు తప్పు చేయొచ్చు కానీ.. వ్యవస్థలు తప్పు చేసే పరిస్థితి ఉండదు. అందుకే.. విమర్శలు వ్యక్తుల మీదనే తప్పించి.. వ్యవస్థల మీద కాదన్న విషయాన్ని మర్చిపోయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆశిత్‌ ఆవేశంతో ఊగిపోతూ.. ఖాకీ బట్టలు వేసుకున్న పోలీసు కుక్కలంటూ తీవ్రమైన వార్నింగ్‌ ఇచ్చారు.

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ హవాను నిలువరించటంలో కిందామీదా పడుతున్న పార్టీలకు ఏం చేయాలో తోచని పరిస్థితి. మరి ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారో కానీ.. సదరు ఎమ్మెల్యే పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైనం.. సొంత పార్టీ నేతలకు సైతం షాక్‌ తినిపించింది. ''మీరిద్దరూ ఒకరికొకరు మద్ధతుతో చేస్తున్న దారుణాలకు తెరదించండి'' అంటూ మండిపడ్డారు. మరోవైపు.. పోలీసులను ఉద్దేశించి.. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీకి చెందిన నేతలే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. వ్యవస్థలపై విరుచుకుపడితే ఎవరు మాత్రం సమర్థిస్తారు..?