Begin typing your search above and press return to search.

అక్రమ అరెస్ట్‌, పోలీసులకు లక్ష జరిమానా!

By:  Tupaki Desk   |   23 May 2015 5:58 AM GMT
అక్రమ అరెస్ట్‌, పోలీసులకు లక్ష జరిమానా!
X
కరళ హై కోర్టు ఒక ఆసక్తికరమైన తీర్పునిచ్చింది. ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేసినందుకు పోలీసులకు ఏకంగా లక్ష రూపాయల జరిమానాను విధించింది. కోర్టు ఖర్చుల కింద ఆ వ్యక్తికి మరో పదివేల రూపాయల డబ్బును కూడా చెల్లించాలని పోలీసు శాఖను ఆదేశించింది. ఈ మేరకు అక్రమంగా వ్యవహరించిన పోలీసులకు కోర్టు మొట్టికాయలు వేసింది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. కేరళలోని కొచ్చి ప్రాంతంలో మావోయిస్టు అనే ఆరోపణలతో బాలకృష్ణన్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ వ్యవహారం అటు తిరిగి హై కోర్టు వరకూ వెళ్లింది.

అయితే బాలకృష్ణన్‌ ఎటువంటి నేరానికీ పాల్పడలేదు. ఎలాంటి హింసాకాండలోనూ పాలు పంచుకోలేదని పోలీసులే చెప్పారు.అయితే అతడు సిద్ధాంతపరంగా మావోయిస్టు అని వారు అంటున్నారు. అందుకే అరెస్టు చేశామని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ వాదనతో కోర్టుకు చిర్రెత్తుకొచ్చింది.

ఎటువంటి హింసాకాండలోనూ పాలు పంచుకోకపోయినా.. ఒక వ్యక్తిని కేవలం మావోయిస్టు అంటూ అరెస్టు చేయడం తప్పు అని కోర్టు స్పష్టం చేసింది. అతడు ఆ సిద్ధాంతాలను విశ్వసించడంలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించింది. బాలకృష్ణన్‌ను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టుగానే భావిస్తూ కోర్టు పోలీసులను మందలించింది.

అరెస్టు చేసి కొన్ని రోజుల పాటు జైల్లో పెట్టినందుకు గానూ బాలకృష్ణన్‌కు పోలీసు శాఖ లక్ష రూపాయల పరిహారాన్ని ఇవ్వాలని కోర్టు అదేశించింది. అంతేగాక కోర్టు ఖర్చులకు గానూ బాలకృష్ణన్‌కు పదివేల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పింది. మొత్తానికి పోలీసులు ఈ వ్యవహారంలో భలే ఇరుక్కొన్నారు!