Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ : బస్తీ

By:  Tupaki Desk   |   3 July 2015 10:55 AM GMT
సినిమా రివ్యూ :  బస్తీ
X
రివ్యూ: బస్తీ
రేటింగ్‌: 1 /5
తారాగణం: శ్రేయన్‌ కపూర్‌, ప్రగతి, ముఖేష్‌ రుషి, కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్‌, స్నిగ్ధ, సత్య, ఆలీ, సప్తగిరి తదితరులు
సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి
ఛాయాగ్రహణం: వి.కె.గుణశేఖర్‌
నిర్మాణం: వజ్మాన్‌ ప్రొడక్షన్స్‌
రచన, దర్శకత్వం: వాసు మంతెన

తెలుగు తెరపైకి వారసులు దండయాత్ర చేస్తున్న సమయమిది. ఒకప్పుడైతే హీరోల ఫ్యామిలీస్‌కి చెందిన వాళ్లే ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్లు. హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌.. ఇలా అందరి వారసులూ హీరోలైపోతున్నారు. ఈ వరస చూశాకే జయసుధకు కూడా ఆశ పుట్టిందేమో! శ్రేయన్‌ కపూర్‌ని కూడా హీరోను చేసింది. నటనపై తనకేనాడూ ఆసక్తి లేదని.. కానీ ఈ మధ్యే సినిమాలపై మనసు మళ్లిందని.. 'బస్తీ' కథ తెగ నచ్చేసి హీరో అయిపోయానని చెప్పాడు శ్రేయన్‌. వారం రోజులుగా విపరీతమైన పబ్లిసిటీ చేసి పెద్ద ఎత్తునే రిలీజ్‌ చేశారు ఈ సినిమాను. మరి జయసుధ వారసుడి అరంగేట్రం ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ:
అమ్మిరాజు (ముఖేష్‌ రుషి), భవాని (అభిమన్యు సింగ్‌) హైదరాబాద్‌లో పెద్ద డాన్‌లు. ఒకరంటే ఒకరికి పడదు. ఐతే తన బిజినెస్‌లకు భవాని అడ్డు పడతున్నాడని.. అతడి చెల్లెలు స్రవంతి (ప్రగతి)ని కిడ్నాప్‌ చేస్తాడు అమ్మిరాజు. అదే సమయంలో తన బాబాయి కొడుకైన విజయ్‌ (శ్రేయన్‌ కపూర్‌) యుఎస్‌ నుంచి ఇండియాకు వస్తాడు. తన అన్న ఇంట్లో ఉన్న స్రవంతితో విజయ్‌ ప్రేమలో పడతాడు. వీళ్లిద్దరి పెళ్లి జరిపించడం కోసం అమ్మిరాజు.. భవానితో రాజీకొస్తాడు. కానీ భవాని ఆ ప్రతిపాదనకు ఒప్పుకోకపోవడమే కాదు.. అమ్మిరాజును కూడా చంపేస్తాడు. విజయ్‌, స్రవంతిలను కూడా చంపాలని చూస్తాడు. మరి ఈ ప్రేమ జంట అతడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడిందన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ:
జయసుధ కొడుకు హీరోగా పరిచయమవుతున్న సినిమా కాబట్టి కథాకథనాల కంటే ముందు హీరో గురించి మాట్లాడుకుందాం. 'బస్తీ'లో ఓ సన్నివేశంలో హీరో వచ్చి అలా నిలబడతాడు. అతణ్ని చూసి మరో పాత్రధారి.. ''కుర్రాడు స్మార్ట్‌గా హీరోలా ఉన్నాడండీ'' అంటాడు. బహుశా జయసుధ కూడా తన కొడుకు ఒడ్డూపొడుగూ కలరూ చూసి అతణ్ని హీరోను చేసేయాలని ఉత్సాహం చూపించి ఉండొచ్చు. కానీ అంతకంటే ముందు తన కొడుక్కి తనలో పదో వంతు నటనైనా వచ్చేలా తర్ఫీదునివ్వాల్సింది. ఆమె ఆ పని చేశారో లేదో కానీ.. శ్రేయన్‌ మాత్రం సినిమాలో ఓ ఉత్సవ విగ్రహంలా నిలబడ్డం తప్ప చేసిందేమీ లేదు. అతడి నట విన్యాసాల్ని చూసి భరించడం ఓ ఎత్తయితే.. తలాతోకా లేకుండా కథాకథనాలతో కొత్త దర్శకుడు వాసు మంతెన పెట్టిన హింసను తట్టుకోవడం మరో ఎత్తు.

ఎ డేరింగ్‌ సెగా ఆఫ్‌ లవ్‌... ఇదీ సినిమాకు పెట్టిన క్యాప్షన్‌. దీన్ని చూసి ఇందులో ఏదో అద్భుతమైన ప్రేమకథ ఉండొచ్చన్న భ్రమలు కలగొచ్చు. ఆ ప్రేమకథ ఎలా సాగుతుందో చూద్దాం.. హీరోయిన్‌ను హీరో అన్నయ్య తెచ్చి పైన గదిలో బంధిస్తాడు. తొలి రోజు హీరో ఆమెను కలిసి ఆమె ఎవరో తెలుసుకుంటాడు. రెండో రోజు ఆమెకు బట్టలు తెచ్చిచ్చి.. రాత్రంతా ఆమెతో ముచ్చట్లు చెబుతాడు. అలాగే తెల్లారిపోతుంది. ''ఈ రోజు నా జీవితంలో మరువలేని రోజు'' అంటూ ఓ ఎమోషన్‌ తెచ్చేసుకుంటుంది హీరోయిన్‌. తర్వాతి రోజు సాయంత్రం మళ్లీ హీరో వచ్చి గిటార్‌ పట్టుకుని ఓ పాట అందుకుంటాడు. ఆ పాట అవ్వగానే హీరోయిన్‌ వచ్చి అతణ్ని వాటేసుకుంటుంది. హీరో ''ఐలవ్యూ టూ'' అంటాడు. వెంటనే కింద తన అన్నయ్య దగ్గరికొచ్చి.. ఆమె లేకుండా ఒక్కరోజు కూడా బతకలేనని చెప్పేస్తాడు. ఇక ఆ అన్నయ్య హీరో, హీరోయిన్‌ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారంటూ అవతల విలన్‌ దగ్గరికి రాయబారానికి వెళ్లిపోతాడు. ఇదీ.. వాసు మంతెన 'అద్భుతం' అనుకుని రాసి తీసిన ప్రేమకథ.

ప్రథమార్ధంలో ఈ 'అద్భుతమైన ప్రేమకథ'ను ఆస్వాదించాక.. ఇక ద్వితీయార్ధంలో హీరోకు, విలన్‌కు మధ్య 'ఉత్కంఠభరితమైన' పోరాటం ప్రేక్షకుల్ని మరో లోకానికి తీసుకెళ్తుంది. హీరో సింపుల్‌గా హీరోయిన్‌తో కలిసి రాష్ట్రం దాటిపోయి అక్కడెక్కడో డ్యూయెట్లు పాడేసుకుని.. పెళ్లి కూడా చేసేసుకుంటాడు. హీరో ఏ రైలు ఎక్కాడో విలన్‌ గ్యాంగ్‌కు తెలిసినా.. వాళ్లెందుకు ఫాలో అవ్వరో అర్థం కాదు. హీరో హైదరాబాద్‌కు వచ్చి విలన్‌ ఇంటికే వెళ్లి హీరోయిన్‌ పాస్‌పోర్ట్‌ కూడా పట్టుకొచ్చేస్తాడు. అప్పుడూ విలన్‌ నిద్రపోతూనే ఉంటాడన్నమాట. కానీ చివర్లో హీరో ఫారిన్‌ వెళ్లిపోతుంటే సడెన్‌గా వచ్చి కారుతో గుద్దేస్తాడు. అయినా రౌడీల్ని పెట్టి హీరోను చంపించాలి లేదంటే లారీతో గుద్దించేయాలి కానీ.. తనే కారు తీసుకెళ్లి హీరో కారును గుద్దేసి.. తనే దారుణంగా గాయపడ్డమేంటో?

ఎదురుపడ్డ వాళ్లందరినీ చంపడం తప్ప.. విలన్‌ ఉద్దేశమేంటన్నదే అర్థం కాదు. తన చెల్లే అయిన హీరోయిన్‌ను కూడా అతను ఎందుకు కాల్చాలనుకుంటాడో తెలియదు. హీరో చివర్లో ''గన్ను పడితే నేను నీకంటే పెద్ద రౌడీని తెలుసా'' తెలుసా అంటూ అదేదో సినిమాలో మాస్‌ హీరో చెప్పినట్లు డైలాగ్‌ చెప్పేసి విలన్‌ కథకు ముగింపు పలికేస్తాడు. ఎండ్‌ టైటిల్స్‌ వేస్తూ... ఏదో కళాఖండం తీసినట్లు మేకింగ్‌ తాలూకు ఫొటోలు చూపిస్తూ బస్తీ బస్తీ అంటూ సాంగ్‌ రన్‌ చేస్తుంటే.. సినిమాకు వచ్చిన పాపానికి ప్రేక్షకుడు సీటు తల బాదుకోవడం తప్ప ఏం చేయగలడు పాపం! కోట శ్రీనివాసరావు, ముఖేష్‌ రుషి, అభిమన్యు సింగ్‌ లాంటి వాళ్లు ఏం చూసి సినిమా ఒప్పుకున్నారో.. ఆలీ, సప్తగిరి, సత్య లాంటి వాళ్లు మీతో కామెడీ చేయిస్తున్నాం అంటే ఎలా నమ్మారో.. ఇలాంటి కథాకథనాల్ని నమ్మి ఆ ప్రొడ్యూసర్‌ ఎలా డబ్బులు పెట్టాడో.. వాళ్లకే తెలియాలి. ఇంతమందిని మెప్పించి ఒప్పించినందుకు మాత్రం డైరెక్టర్‌ వాసు మంతెనను సన్మానించాల్సిందే.

నటీనటులు:
సహజ నటిగా జయసుధకు పేరు. ఆమె కొడుక్కి ఇసుమంతైనా అది వారసత్వంగా రాలేదు. అంత ఎబ్బెట్టుగా నటించాడు కుర్రాడు. పాస్‌ మార్కులకు కొంచెం తక్కువ పడితే.. ఏదో మొహమాటం కొద్దీ మూణ్నాలుగు మార్కులు కలపొచ్చు కానీ.. సింగిల్‌ డిజిల్‌ కూడా దాటకుంటే ఎవరైనా ఏం చేయగలరు? మనోడి యాక్టింగ్‌ స్కిల్స్‌ ఆ స్థాయిలో ఉన్నాయి. అతడితో పోలిస్తే హీరోయిన్‌ ప్రగతి డిస్టింక్షన్‌ స్టూడెంట్‌లా కనిపిస్తుంది కానీ.. ఆమెకు కూడా నటనలో పాస్‌ మార్కులు పడవు. కొంచెం క్యూట్‌గా ఉంది కానీ.. ఓవరాల్‌గా హీరోయిన్‌ ఫీచర్స్‌ అయితే లేవు. అభిమన్యు సింగ్‌ ఈ సినిమాలో ఈ పాత్ర ఎలా ఒప్పుకున్నాడో మరి. అంత పేలవంగా ఉంది అతడి క్యారెక్టర్‌. ఎక్స్‌ప్రెషన్స్‌ మాత్రం గబ్బర్‌సింగ్‌ సినిమాలో కంటే ఎక్కువే ఇచ్చాడు. సప్తగిరి, ఆలీల గురించి చెప్పుకోవడం వృథా. స్నిగ్ధ ఎప్పుడూ కనిపించే టామ్‌ బాయ్‌ పాత్రలోనే చేసింది. ఆమె అబ్బాయిలా చూపిస్తూ సెటైర్లు వేయించే సినిమాలు ఇంకెన్ని వస్తాయో! సత్య కామెడీ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు.

సాంకేతిక వర్గం:
ఉన్నంతలో సాంకేతిక విభాగాలు కొంచెం పర్వాలేదు. ప్రవీణ్‌ ఇమ్మడి రెండు మూడు పాటల్లో ప్రతిభ చూపించాడు. కానీ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం సినిమా స్థాయికి తగ్గట్లే ఉంది. ఏదో జరిగిపోతున్నట్లు... సన్నివేశాల్లో ఏమాత్రం ఫీల్‌ లేకున్నా.. ఏవో అద్భుతమైన ప్రణయ సన్నివేశాలు పండుతున్నట్లు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో బిల్డప్‌ ఇచ్చాడు. గుణశేఖర్‌ ఛాయాగ్రహణం కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు సీరియల్‌ స్థాయికి ఎక్కువ సినిమా స్థాయికి తక్కువ అన్నట్లున్నాయి. ఏదో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌కు చేసినట్లు కొన్ని చోట్ల టెక్నికల్‌ జిమ్మిక్కులు చేశారు. వాటి అవసరమేంటో దర్శకుడికే తెలియాలి..

చివరిగా...
కంటెంట్‌ తక్కువ, ప్రమోషన్‌ ఎక్కువ !