Begin typing your search above and press return to search.

ఇది బాలయ్య మాట; ముక్కలైనా తెలుగోళ్లంతా ఒక్కటే..!

By:  Tupaki Desk   |   4 July 2015 4:14 PM GMT
ఇది బాలయ్య మాట; ముక్కలైనా తెలుగోళ్లంతా ఒక్కటే..!
X
రాష్ట్ర విభజన మీద ఇప్పటివరకూ పెద్దగా వ్యాఖ్యలు చేయని నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) ఉత్సవాల్లో ఆయన పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆయన కాసింత ఉద్వేగంగా మాట్లాడారు.

తెలుగు మాట్లాడేవారు రెండు రాష్ట్రాలుగా ఆవిర్భవించిన నేపథ్యంలో బాలకృష్ణ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రం రెండు ముక్కలు అయినప్పటికీ తెలుగువారంతా ఒక్కటేనని వ్యాఖ్యానించారు. భాషలు.. యాసలు వేరైనా మనమంతా ఒక్కటేనని ఎన్టీఆర్‌ చెప్పిన విషయాన్ని బాలకృష్ణ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రవాసాంధ్రులు కృషి చేయాలని చెప్పిన ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని పొగిడేశారు.

గతంలో ఎన్టీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నియోజకవర్గానికి తానిప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించటంపై బాలకృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటానికి తానెంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. తన అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన బాలయ్య.. తానేం చేసినా తన అభిమానులు వెనుక ఉంటారని.. అదంతా తన పూర్వజన్మ సుకృతమని వ్యాఖ్యానించారు. ఇటీవల విడుదలైన లయన్‌ సినిమాను ప్రస్తావించి.. అభిమానుల్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.

పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాట్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్న నాట్స్‌పై ప్రశసంల వర్షం కురిపించారు. ఆపదలో ఉన్న వారికి నాట్స్‌ ఎంతో ఆదుకుంటుందని.. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు వారు వేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని వ్యాఖ్యానించారు.