Begin typing your search above and press return to search.

డబ్‌ స్మాష్‌లో బాలయ్య పంచ్‌లే

By:  Tupaki Desk   |   30 Jun 2015 7:45 AM GMT
డబ్‌ స్మాష్‌లో బాలయ్య పంచ్‌లే
X
యువతరం ఏది కొత్త అనుకుంటే దాన్నే ఫాలో అయిపోతుంటారు. అంతేనా ఎప్పటికప్పుడు ఈ కొత్తను కొన్ని అవకాశాల కోసం కూడా వాడేస్తున్నారు. డబ్‌ స్మాష్‌ .. ఇటీవలి కాలంలో లేటెస్ట్‌ ట్రెండ్‌. ఈ ఆయుధాన్ని ఏకంగా సినిమాల్లో ఛాన్సుల కోసం ఉపయోగిస్తున్నారంటే నమ్మగలమా? కానీ నమ్మి తీరాల్సిందే.

తమ ఫేవరెట్‌ హీరో లేదా కమెడియన్‌ లేదా హీరోయిన్‌ ఏదైనా పంచ్‌ డైలాగ్‌ విసిరితే దాన్ని కాపీ చేసి యథాతథంగా చెప్పేస్తున్నారు. వాయిస్‌, ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్‌ ప్రతిదీ ఫాలో అయ్యి పెద్ద రేంజులో క్లిక్కవుతున్నారు. ఇలాంటివి కొందరికి సినిమా ఛాన్సులు కూడా తెస్తున్నాయి. ఆన్‌లైన్‌లో స్టార్లను ఇమ్మిటేట్‌ చేస్తూ డబ్‌ స్మాష్‌లు ఒకటే సందడి.

డబ్‌స్మాష్‌లో రజనీకాంత్‌, పవన్‌, బాలయ్యబాబు, బ్రహ్మానందం, సునీల్‌ లాంటి నటుల్ని ఇమ్మిటేట్‌ చేసిన వాటికి గిరాకీ బావుంది. హీరోల్లో బాలయ్య, కమెడియన్లలో సునీల్‌ (మగువల్లో పాపులారిటీ ఎక్కవగా ఉంది) టాప్‌ పొజిషన్‌లో ఉన్నారు. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్‌ని అనుకున్నావా? షూటర్‌ని కాల్చి పారేస్తా.. అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌ని ఓ అభిమాని అద్భుతంగా అభినయించాడు. ఈ డబ్‌ స్మాష్‌కి విపరీతమైన క్లిక్కులు పడుతున్నాయి.

సింహా, లెజెండ్‌ల నుంచి మూడు పంచ్‌ డైలాగుల్ని డబ్‌స్మాష్‌లో ఉపయోగించుకుని బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్నానని సదరు బాలయ్య అభిమాని చెప్పాడు. అదే తీరుగా రజనీ, పవన్‌ల సినిమాల్లోని పంచ్‌ డైలాగులతోనూ డబ్‌ స్మాష్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ చావులు నావల్ల కావడం లేదు నాన్నా.. పైగా రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదు.. అంటూ అందాల రాక్షసిలో లావణ్య త్రిపాఠి డైలాగ్‌ని ఓ వీరాభిమాని ఫాలో చేసింది. దీనికి ఆన్‌లైన్‌లో చక్కని స్పందన వస్తోందని చెబుతోంది.