Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ : బాహుబలి

By:  Tupaki Desk   |   10 July 2015 6:52 AM GMT
సినిమా రివ్యూ : బాహుబలి
X
రివ్యూ: బాహుబలి
రేటింగ్‌: 3.25 /5
తారాగణం: ప్రభాస్‌, రానా దగ్గుబాటి, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్‌, సత్యరాజ్‌, ప్రభాకర్‌, అడివి శేష్‌, రోహిణి, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: కీరవాణి
ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని
కథ: విజయేంద్ర ప్రసాద్‌
మాటలు: విజయ్‌, అజయ్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజమౌళి

ఓ సినిమా చూశాక అద్భుతం అనిపించొచ్చు. కానీ సినిమా చూడకముందే ఇది అద్భుతమే.. మరో మాట లేదు అని ప్రేక్షకుడు ఫిక్సయిపోతే..? 'బాహుబలి' విషయంలో దాదాపుగా తెలుగు ప్రేక్షకులంతా ఇలాంటి అంచనాలతోనే ఉన్నారు. ఐతే కెరీర్‌ ఆరంభం నుంచి సినిమా సినిమాకు ఇలా అంచనాలు పెరుగుతూనే ఉన్నా.. తన అసాధారణ ప్రతిభతో ఆ అంచనాల్ని మించే సినిమాలు అందిస్తూనే వచ్చాడు రాజమౌళి. ఐతే బాహుబలి మీద ఉన్న అంచనాల గురించి మాటల్లో వర్ణించడం కష్టం. ఆకాశాన్నంటడమే కాదు.. దాన్ని దాటి కూడా పైకెళ్లిపోయాయి అంచనాలు. మరి ఈ స్థాయిలో ఉన్న అంచనాల్ని 'బాహుబలి' ఏ మేరకు అందుకుంది? రాజమౌళి అన్నట్లే.. 'క్లాసిక్‌' తీశాడా? బాహుబలి నిజంగానే మనం గర్వంగా చెప్పుకునే సినిమానా? చూద్దాం పదండి.

కథ:
ఓ తల్లి తన ప్రాణం పణంగా పెట్టి కాపాడిన బిడ్డకు శివుడు అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటుంది మరో తల్లి. ఆ శివుడు (ప్రభాస్‌) పెరిగి పెద్దవుతూ అనేక విన్యాసాలు చేస్తుంటాడు. ఓ జలపాతం కింద గూడెంలో ఉండే శివుడు.. ఆ జలపాతం వచ్చే కొండపైన ఏముందో తెలుసుకోవాలని చిన్నప్పట్నుంచి ప్రయత్నిస్తుంటాడు. అతను యుక్త వయసుకు వచ్చాక ఓ ఊహాసుందరి స్ఫూర్తితో ఎట్టకేలకు పైకి ఎక్కేస్తాడు. అతడి ఊహాసుందరి అవంతిక (తమన్నా).. భల్లాలదేవుడు (రానా దగ్గుబాటి) పాలిస్తున్న మహిష్మతి రాజ్యంలో బందీగా ఉన్న దేవసేన (అనుష్క)ను విడిపించడానికి పోరాడుతుంటుంది. అవంతికను ప్రేమలోకి దింపిన శివుడు.. ఆమె కోసం దేవసేనను విడిపించడానికి మహిష్మతికి వెళ్తాడు. దేవసేనను విడిపించుకుని వచ్చాక.. తాను ఆ మహిష్మతి ప్రజలంతా దేవుడిలా కొలిచే రాజు బాహుబలి కుమారుడినని తెలుస్తుంది శివుడికి. ఇంతకీ బాహుబలి గతమేంటి? అతడికి భల్లాలదేవుడికి మధ్య శత్రుత్వమేంటి? అన్నది తెరమీదే చూడాలి.

కథనం, విశ్లేషణ:
బాహుబలి విషయంలో ఏం అద్భుతంగా ఉండొచ్చనుకున్నామో వాటి విషయంలో తిరుగులేదు. కథాకథనాలు ఎలా ఉన్నా.. విజువల్‌ గ్రాండియర్‌ విషయంలో మాత్రం ప్రతి ప్రేక్షకుడూ అబ్బురపడటం ఖాయమని అందరూ అనుకున్నారు. ఈ విషయంలో బాహుబలి గురించి వర్ణించడానికి మాటలు చాలవు. ఆరంభంలో వచ్చే జలపాత దృశ్యాల దగ్గర్నుంచి.. చివర్లో యుద్ధ సన్నివేశాల వరకు అడుగడుగునా.. కళ్లు చెదిరిపోయే విజువల్‌ గ్రాండియర్‌ బాహుబలి సొంతం. ఈ ఒక్క విషయంలోనే టికెట్‌ డబ్బులు గిట్టుబాటైపోతాయంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు.

ఈ విజువల్‌ గ్రాండియర్‌కు తోడు మాస్‌ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే హీరోయిజం ఉంది.. దానికి దీటైన విలనిజం కూడా ఉంది. శివగామి, కట్టప్ప లాంటి బలమైన క్యారెక్టరైజేషన్స్‌ ఉన్నాయి. చూస్తోంది తెలుగు సినిమానా.. హాలీవుడ్‌ మూవీనా అని ఆశ్చర్యం కలిగించే అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయి. గొప్ప ఆర్ట్‌ వర్క్‌ ఉంది. రాజమౌళి మార్కు యాక్షన్‌ పార్ట్‌ ఉంది. తెలుగు తెరపై ఇప్పటిదాకా ఎన్నడూ చూడని భారీ యుద్ధ సన్నివేశాలున్నాయి. ఇలా హైలైట్ల గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇన్ని ఉన్నా.. బాహుబలి చూశాక ఏదో వెళితిగా అనిపిస్తుంది. ఏదో మిస్సయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఆ తేడా కథాకథనాల విషయంలోనే కావచ్చు.

కథ విషయంలో మనం ఎక్కువ ఆశించలేం. రాజమౌళి అలా ఆశించొద్దన్న సంకేతాలే ఇస్తాడు ఎప్పుడూ. అతడి సినిమాల్లో ఎప్పుడూ కూడా గొప్ప కథలేమీ ఉండవు. మ్యాజిక్‌ అంతా కథనంలోనే ఉంటుంది. బలమైన ఎమోషన్స్‌తో, బిగువైన సన్నివేశాలతో.. కట్టిపడేసే కథనంతో ప్రేక్షకుల్ని లాక్‌ చేసేయడం రాజమౌళికి మాత్రమే తెలిసిన విద్య. ఐతే ఈసారి ఈ అదనపు హంగుల మీద మరీ ఎక్కువ దృష్టిపెట్టి.. తన ప్రధాన బలం 'స్క్రీన్‌ప్లే' మీద కొంచెం ఫోకస్‌ తగ్గించాడేమో అనిపిస్తుంది.

బాహుబలిలో హైలైట్లకు కొదవలేదు. చెప్పాలంటే ప్రతి సన్నివేశం ఓ హైలైటే. తెర మీద ఆ భారీతనం చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. సినిమా ఎక్కడా బోర్‌ కొట్టిన ఫీలింగ్‌ కూడా కలగదు కూడా. ప్రతి సన్నివేశమూ క్లైమాక్స్‌ స్థాయిలో భారీగా ఉండేలా.. విజువల్స్‌ కళ్లు చెదిరిపోయేలా తెరకెక్కించాడు రాజమౌళి. ఐతే రాజమౌళి గత సినిమాల స్థాయిలో ఇందులో ఎమోషన్స్‌ అనుకున్నంత స్థాయిలో పండలేదనిపిస్తుంది. విజువల్‌ గ్రాండియర్‌తో, హద్దులు దాటిన హీరోయిజంతో చాలాచోట్ల ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడంలో రాజమౌళి విజయవంతమయ్యాడు. ఐతే ఈ క్రమంలో లాజిక్‌ సంగతి పూర్తిగా పక్కనబెట్టేశాడు.

మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించడం కోసమని హీరోను మరీ సూపర్‌మ్యాన్‌లా చూపించాడు రాజమౌళి. హీరో చేసే విన్యాసాలు మాస్‌ ఆడియన్స్‌తో విజిల్స్‌ అయితే కొట్టిస్తాయి కానీ.. చాలాచోట్ల అతిగా, కొన్ని చోట్ల మరీ సిల్లీగా అనిపిస్తాయి. కొండ ఎక్కేటపుడు చేసే విన్యాసాలు.. ఆ తర్వాత పెద్ద పెద్ద బండల్ని దొర్లించేసి మంచు పర్వతాన్ని కూల్చేయడం, వందలమంది సైనికుల్ని మట్టుబెట్టడం.. అంత పెద్ద భల్లాలదేవుడి విగ్రహాన్ని కిందపడకుండా ఒక్కడే ఆపేయడం.. మహిష్మతి రాజ్యంలోకి ఒక్కడే వెళ్లి అంతమంది సైనికుల నుంచి తప్పించుకుని దేవసేనను తీసుకొచ్చేయడం.. ఇలా ప్రతి సన్నివేశంలోనూ హీరోయిజం హద్దులు దాటిపోయింది. ఎమోషన్స్‌తో కాకుండా.. కేవలం ఈ మితిమీరిన హీరోయిజంతోనే ప్రథమార్ధాన్ని నడిపించాడు రాజమౌళి. ప్రథమార్ధంలో హీరో క్యారెక్టర్‌.. అతడి విన్యాసాలు తప్ప ఇంకేమీ హైలైట్‌ కాలేదు. తన గురువు రాఘవేంద్రరావును గుర్తుకు తెస్తూ రాజమౌళి.. ప్రభాస్‌, తమన్నాలతో ఓ చిలిపి రొమాంటిక్‌ ట్రాక్‌ ట్రై చేశాడు. అది పర్వాలేదనిపిస్తుంది.

ద్వితీయార్ధంలో శివుడు.. రుద్ర తలనరికే సీన్‌ వరకు కూడా సినిమా హీరోయిజం మీదే నడుస్తుంది. ఆ సీన్‌ కూడా మాస్‌ ఆడియన్స్‌ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఐతే ఆ తర్వాత శివుడిని బాహుబలి కొడుకుగా కట్టప్ప గుర్తుపట్టే సన్నివేశం నుంచి కథనం కొంచెం ఎమోషనల్‌గా సాగుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో శివగామి పాత్ర ప్రవేశంతో ఆసక్తి పెరుగుతుంది. ఓ ఇరవై నిమిషాల పాటు కథనాన్ని పకడ్బందీగా నడిపించాడు. ఐతే ఈ దశలో ఐటెం సాంగ్‌ పెట్టాలన్న ఆలోచన రాజమౌళికి ఎందుకొచ్చిందో కానీ.. ఓ ఫ్లోతో సాగుతున్న కథనానికి ఇక్కడ బ్రేక్‌ పడింది. మళ్లీ చివరి 40 నిమిషాలు వార్‌ ఎపిసోడ్‌తో ప్రేక్షకులు ఎంగేజ్‌ అయిపోతారు. యుద్ధ సన్నివేశాలు.. ఆ భారీ తనం చివరి అరగంట కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. యుద్ధ సన్నివేశాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో హాలీవుడ్‌ సినిమాల స్ఫూర్తి కనిపిస్తుంది. కానీ మన స్థాయికి ఇవి అద్భుతమనే చెప్పాలి.

ఐతే బాహుబలి, భల్లాలదేవ మధ్య పోరాటానికి సంబంధించిన ఎపిసోడ్‌ అంతా రెండో భాగానికి అట్టిపెట్టేయడం వల్ల కావచ్చేమో.. తొలిభాగంలో ఆ రెండు పాత్రల మధ్య సన్నివేశాలు అంత బలంగా అనిపించలేదు. ఎమోషన్‌ పండలేదు. అటు శివుడి పాత్రకు కానీ.. ఇటు బాహుబలి క్యారెక్టర్‌కు కానీ.. ఎదురే లేనట్లు చూపించారు. దీంతో విలనిజం అంటూ ఏమీ ఎలివేట్‌ కాలేదు. శివగామి, కట్టప్ప పాత్రల విషయంలో ఉన్నంత బలం, ఎమోషన్‌ మిగతా పాత్రల్లో మిస్సయింది. ఐతే రెండో భాగం కూడా చూశాక అన్ని పాత్రల మీద ఓ అవగాహనకు రావచ్చేమో. తొలి భాగంలోనే బాహుబలి, భల్లాలదేవుడి మధ్య పోరు చూపించేస్తే.. రెండో భాగంలో చూపించడానికి ఏమీ ఉండదని భావించి.. ప్రథమార్ధానికి కాలకేయుడితో యుద్ధం ఎపిసోడ్‌ సెట్‌ చేసుకున్నాడు రాజమౌళి. ఆ ఎత్తుగడ బాగానే ఉంది. ఐతే సినిమాను ముందు ఒక భాగంగా అనుకుని.. ఆ తర్వాత రెండు భాగాలుగా మార్చే క్రమంలో రాజమౌళి అంత పకడ్బందీగా కథనాన్ని తీర్చిదిద్దలేకపోయాడేమో అనిపిస్తుంది. ఈ క్రమంలో క్యాల్కులేషన్స్‌లో తేడా వచ్చేసినట్లుంది. ఎప్పుడూ అతడి సినిమాల్లో కనిపించే బిగువు, బలమైన ఎమోషన్స్‌ ఇందులో మిస్సయ్యాయనే చెప్పాలి.

నటీనటులు:
ఇక్కడ ప్రభాస్‌, రానాల కంటే ముందు రమ్యకృష్ణతో మొదలుపెట్టాల్సిందే. ఎందుకంటే.. సినిమాలో అందరికంటే ఎక్కువ ఆకట్టుకునేది ఆమే. శివగామి పాత్రలో ఆమె అద్భుతమైన నటనను ప్రదర్శించింది. సినిమాలో మోస్ట్‌ పవర్‌ఫుల్‌ రోల్‌ ఆమెదే. ప్రతి సన్నివేశంలోనూ రమ్యకృష్ణ తనదైన ముద్ర వేసింది. ఆ పాత్రలో మరెవరినీ ఊహించుకోలేనంత గొప్పగా నటించింది. రాజనీతి గురించి చెబుతూ తిరుగుబాటుదారుల్ని మట్టుబెట్టే సన్నివేశంలో రమ్యకృష్ణ నటన హైలైట్‌ అని చెప్పాలి.

ప్రభాస్‌ శివుడిగా, బాహుబలిగా రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించాడు. శివుడిగా చలాకీతనం ప్రదర్శించి.. బాహుబలిగా హుందాగా నటించాడు. తన రూపం విషయంలో అతడు పడ్డ కష్టం తెరమీద కనిపిస్తుంది. శివుడు, బాహుబలి పాత్రలకు తనే సరైన ఛాయిస్‌ అని రుజువు చేశాడు. ఐతే రెగ్యులర్‌ సినిమాలతో పోలిస్తే.. ఇలాంటి సినిమాలకు కొంచెం భిన్నమైన బాడీ లాంగ్వేజ్‌ చూపించడంలో.. వాయిస్‌ విషయంలో మాత్రం ప్రభాస్‌ ఆకట్టుకోలేదు. కొన్ని సన్నివేశాల్లో అతను సరైన ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వలేపోయాడు. ఐతే పాత్రల కోసం ప్రభాస్‌ పడ్డ కష్టాన్ని, అతడి కమిట్‌మెంట్‌ను మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే.

భల్లాల దేవుడిగా రానా ఆకట్టుకున్నాడు. ప్రభాస్‌తో పోలిస్తే.. రానాకు స్క్రీన్‌ ప్రెజెన్స్‌ తక్కువే. బహుశా అతడి పాత్రకు రెండో భాగంలో ఎక్కువ ప్రాధాన్యం ఉండొచ్చు. రానా గత సినిమాలతో పోల్చి చూస్తే.. నటన విషయంలో అతను ఎంతో వైవిధ్యం చూపించాడు. భల్లాలదేవుడి పాత్ర తాలూకు కన్నింగ్‌నెస్‌ను అతను బాగా క్యారీ చేశాడు.

అవంతికగా తమన్నా పాత్రకు మొదట్లో ఎక్కువ బిల్డప్‌ ఇచ్చారు. కానీ తర్వాత తేల్చేశారు. గ్లామర్‌ పార్ట్‌ వరకు ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. ఐతే వీరనారిగా మాత్రం మెప్పించలేకపోయింది. పోరాట దృశ్యాల్లో ఆమె తేలిపోయింది. ముఖంలో రౌద్రం చూపించబోతే అది తమాషాలా మారింది.

కట్టప్పగా సత్యరాజ్‌ నటనకు తిరుగులేదు. ఆయన తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. తొలి సన్నివేశంలోనే ఆయన తన ముద్ర చూపించారు. ఆ తర్వాత కనిపించిన ప్రతిసారీ స్క్రీన్‌ను ఆక్రమించేశారు. బిజ్జాల దేవగా నాజర్‌ నటన కూడా తన స్థాయికి తగ్గట్లే నటించారు. ఆయన అవతారం షాకిస్తుంది. ఐతే రానా పాత్రలాగే నాజర్‌ క్యారెక్టర్‌కు కూడా రెండో భాగంలో ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశముంది. అనుష్కను ఇలాంటి అవతారంలో చూసి తట్టుకోవడం కష్టం. ఆమెకు వేసిన మేకప్‌ అసహజంగా, ఎబ్బెట్టుగా ఉంది. నటన పరంగా అనుష్కకు పెద్దగా స్కోప్‌ లేదు. రుద్రగా అడివి శేష్‌ పెద్దగా చేసిందేమీ లేదు. అతడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం కూడా లేదు. తన పాత్రలకు నటీనటుల్ని ఎంచుకోవడంలో, వారి నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో రాజమౌళి విజయవంతమయ్యాడు.

సాంకేతిక వర్గం:
'బాహుబలి'కి బ్యాక్‌బోన్‌ సాంకేతిక నిపుణులే. తెరమీద అద్భుతం అనిపించిన ప్రతి దృశ్యంలోనూ టెక్నీషియన్స్‌ ప్రతిభ, శ్రమ కనిపిస్తుంది. సాబు సిరిల్‌ ఆర్ట్‌ వర్క్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మహిష్మతి రాజ్యం కోసం వేసిన సెట్‌లు అద్భుతమనే చెప్పాలి. సినిమాలో దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ అద్భుతమైన ఆర్ట్‌ వర్క్‌ కనిపిస్తుంది. యుద్ధ సన్నివేశాల్లో వాడిన సామాగ్రి, ఆయుధాల విషయంలో కూడా సాబు సిరిల్‌ కృషి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 'బాహుబలి'లో ఇంకో ప్రధానమైన హైలైట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌. 'రోబో' తర్వాత ఇండియన్‌ స్క్రీన్‌పై ఇంత గొప్ప విజువల్‌ ఎఫెక్ట్స్‌ మళ్లీ ఇదే అని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ విషయంలో శ్రీనివాస్‌ మోహన్‌ అండ్‌ టీమ్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

కీరవాణి సంగీతం కూడా సినిమాకు మేజర్‌ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది. పాటలు ఆడియోలో సోసోగా అనిపించాయి కానీ.. తెరమీద మాత్రం చాలా బాగున్నాయి. ఒక్క మనోహరి పాట మినహాయిస్తే అన్ని పాటల చిత్రీకరణ ఆకట్టుకుంది. ఐతే పాటలతో కంటే కూడా నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు కీరవాణి. ఎమోషనల్‌ సీన్స్‌లో, యుద్ధ సన్నివేశాల్లో కీరవాణి రీరికార్డింగ్‌ అదిరిపోయింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ విషయంలో తన అనుభవం చూపించారు. ఐతే ద్వితీయార్ధంలో యుద్ధం ఎపిసోడ్‌కు ముందు కొంచెం కత్తెరకు పని చెప్పాల్సింది. కాస్ట్యూమ్స్‌ విషయంలో రమ రాజమౌళి, ప్రశాంతిల శ్రమ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. విజయ్‌, అజయ్‌ రాసిన మాటలు పర్వాలేదు. మరీ అంత గొప్పగా లేవు. భాష విషయంలో కొన్ని చోట్ల నిలకడ లోపించింది. అక్కడక్కడా మామూలు భాషలోకి వచ్చేశారు. కొన్ని చోట్ల గ్రాంథికంలో డైలాగులు రాశారు. ఇంతమంది నటీనటులతో, సాంకేతిక నిపుణులతో గొప్ప ఔట్‌పుట్‌ రాబట్టుకున్నందుకు రాజమౌళిని ముందుగా అభినందించాలి. మాస్‌ ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేయడంలో తన ప్రత్యేకతను రాజమౌళి మరోసారి చాటున్నాడు. ఐతే స్క్రీన్‌ప్లే విషయంలో, ఎమోషన్స్‌ పండించడంలో ఇంతకుముందులా తనదైన ముద్ర మాత్రం వేయలేకపోయాడని చెప్పాలి.

చివరిగా...
బాహుబలి కంటికి ఇంపే కానీ.. మనసుకే కొంచెం కష్టం!