Begin typing your search above and press return to search.

ఆన్‌లైన్‌లో బాహుబలి వార్‌ మొదలైంది

By:  Tupaki Desk   |   4 July 2015 4:00 AM GMT
ఆన్‌లైన్‌లో బాహుబలి వార్‌ మొదలైంది
X
ఇంటర్నెట్‌, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ రాక ముందు థియేటర్‌ క్యూలో నిలబడి తోపులాటలతో పడిగాపులు పడేవారు ప్రేక్షకులు. 11 గంటల షో కోసం వేకువఝామున 7 గంటలకే లైన్‌లోకి చేరేవారు. కానీ అది గతించిన కాలం. ఇప్పుడు ఆన్‌లైన్‌ వచ్చేసింది. టిక్కెట్టు కావాలి.. అంటే చిటికెలో పని. ఉత్సాహం ఉన్నవాళ్లంతా ఇలా ఆన్‌లైన్‌ బుకింగ్‌ మొదలవ్వగానే క్షణాల్లో కావాల్సిన టిక్కెట్లను కొనుక్కుంటున్నారు.

ప్రస్తుతం ప్రపంచమంతా బాహుబలి రిలీజ్‌ కోసం వేచి చూస్తోంది. ఇంకా వారం రోజులే గడువు. జూలై 10న రిలీజ్‌కి రంగం సిద్ధం. ఈ రోజు మధ్యాహ్నం ఆన్‌లైన్‌ బుకింగ్‌ మొదలైంది. ఆన్‌లైన్‌ ట్రాఫిక్‌కి అవకాశం లేని 2.30 ప్రాంతంలో బుకింగ్‌ మొదలైనా అప్పటికే పడిగాపులు పడుతున్న నెటిజనులు చక చకా టిక్కెట్లు బుక్‌ చేసేసుకున్నారు. ఏసియన్‌ గ్రూప్‌ థియేటర్స్‌కి సంబంధించిన టిక్కెట్ల అమ్మకం పూర్తయింది. ఈ థియేటర్లలో వారం వరకూ హౌస్‌ఫుల్స్‌. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు లభించవు. అలాగే సీడెడ్‌లో వేకువ ఝాము షోలకు సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. బెనిఫిట్‌ షోకి భారీ మొత్తంలో అంటే 2000 నుంచి 3000 టిక్కెట్‌ ధర నిర్ణయించినా తీవ్రమైన పోటీ నెలకొందని చెబుతున్నారు. ఏ రకంగా చూసినా ఇటీవలి కాలంలో సినిమా టిక్కెట్టు కోసం ఇంత పెద్ద మొత్తాల్ని వెచ్చించడం, ఎగబడి కొనేయడం చూడనేలేదు.

ఏపీ రాజధాని పరిధి విజయవాడ, గుంటూరులో బెనిఫిట్‌ షో టిక్కెట్ల ద్వారా వచ్చిన మొత్తాల్ని నిర్మాతలు ప్రభుత్వానికి డొనేట్‌ చేయనున్నారు. రాజధాని నిర్మాణం కోసం తమ వంతు ఉడత సాయం ఇది. బాహుబలి తొలిరోజే దాదాపు 20కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌లో ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయం అని అంటున్నారు.