Begin typing your search above and press return to search.

ఇదేం చేతకానితనం రాజుగారు.!

By:  Tupaki Desk   |   24 May 2015 10:35 AM GMT
ఇదేం చేతకానితనం రాజుగారు.!
X
చేతకానితనానికి ఒక హద్దు ఉంటుంది. కానీ.. ఏపీ అధికారపక్ష నేతల తీరు చూస్తుంటే.. చేతకానితనంలో మాస్టర్‌ డిగ్రీ చేసినట్లుగా వ్యవహరిస్తున్నారు. విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంపై కేంద్రం హామీ ఇవ్వటం తెలిసిందే.

దీనిపై మోడీ సర్కారు కొలువు తీరిన నాటి నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారీ పిల్లిమొగ్గలు వేస్తూ కాలం గడిపేస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేకహోదా రావటం లేదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పేయటం తెలిసిందే.

ఆర్థికమంత్రి కుండబద్ధలు కొట్టిన తర్వాత ఇంక చల్లకింద ముంత దాచటం ఎందుకు అనుకున్నారో కానీ.. ఒక్కొక్కరూ ప్రత్యేకహోదా గుట్టు విప్పేసి.. తప్పును ఆర్థిక సంఘం మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకపోవటానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులే కారణమని ఏపీకి చెందిన కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు చెప్పుకొచ్చారు.

సాంకేతిక కారణాల వల్ల ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోయిందని.. ఒక్క ఏడాదిలోనే అన్ని జరిగిపోవని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి నేతలు కేంద్రంలో ఉండటం వల్లే ఏపీ విషయంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోగలుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా రాకపోవటాన్ని సీరియస్‌గా తీసుకునే కన్నా.. ప్రజల్ని కన్వీన్స్‌ చేసే ప్రయత్నం చూసినప్పుడు.. ఏపీ అధికారపక్షం కమిట్‌మెంట్‌ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. నిజానికి కేంద్రం కానీ.. ప్రత్యేకహోదా మీద సీరియస్‌గా ఉండి.. ఇవ్వాలని బలంగా నిర్ణయించుకొని ఉంటే.. 14వ ఆర్థిక సంఘం మాత్రం ప్రతిపాదించేది కాదా?