Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు కేసు.. రూపురేఖలు మారనున్నాయా?

By:  Tupaki Desk   |   6 July 2015 4:34 AM GMT
ఓటుకు నోటు కేసు.. రూపురేఖలు మారనున్నాయా?
X
రూ.50లక్షల మొత్తం అధికారపార్టీకి చెందిన నామినేటెడ్‌ ఎమ్మెల్యేకు విపక్ష ఎమ్మెల్యే సమక్షంలో ఇచ్చిన వీడియో బయటకు వచ్చినప్పుడు.. రేవంత్‌ రెడ్డి పని అయిపోయిందని.. రాజకీయంగా ఆయనకు గడ్డు పరిస్థితి ఎదురవుతుందని అందరూ భావించారు. అయితే.. ఇలాంటి వీడియోల వల్ల ప్రయోజనం.. రాజకీయ లబ్థి తాత్కలికమే తప్ప.. దీర్ఘకాలికం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఆ మాటకు వస్తే.. ఈ కేసు కోర్టులో వాదన.. ప్రతివాదనల మధ్య ఉక్కిరిబిక్కిరి అయిపోయి.. చివరకు అనుకున్న ఫలితం నెరవేరదన్న వాదన వినిపించింది. ఈ మాటల్ని మొదట పెద్దగా పట్టించుకోని తెలంగాణ ఏసీబీ అధికారులు.. ఇప్పుడిప్పుడే తత్వం బోధ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. కేసు పెట్టటం ఎంత ఈజీనో.. దాన్ని చట్టప్రకారం తప్పు అని నిరూపించటం ఎంత కష్టమన్న విషయం తెలిసి వస్తున్నట్లుంది.

అందుకే కాబోలు.. తాజాగా తమకు ఎదురైన అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని.. కేసులు నమోదు మొదలు.. విచారణకు పిలిచే సందర్భంలోనూ అనుసరించే వ్యూహాల్లో మార్పులు చేసుకున్నట్లు కనిపిస్తోంది. సెక్షన్ల విషయం చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయం రేవంత్‌ ఉదంతంలో అనుభవమైన ఏసీబీ అధికారులు.. తాజాగా టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఓటుకు నోటు కేసులో సండ్రకు.. తొలుత సెక్షన్‌ 160 మీద నోటీసులు జారీ చేసిన దానికి భిన్నంగా తాజాగా సెక్షన్‌41(ఎ) కింద నోటీసులు ఇచ్చారు. తాజా సెక్షన్‌ ప్రకారం.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంటుంది. సండ్రను అరెస్ట్‌ చేయాలని భావిస్తే.. తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఏసీబీ అధికారులు భావిస్తే అరెస్ట్‌ చేసే వీలుంది. ఓటుకు నోటు విషయంలో తెలంగాణ ఏసీబీ అధికారుల వైఖరి మారిందనటానికి తాజాగా మార్చిన సెక్షన్‌తో నోటీసులు ఇవ్వటమే ఒక నిదర్శనంగా చెబుతున్నారు. మరి.. అంచనాలు నిజం అవుతాయా? సండ్రను విచారించి వదిలేస్తారా? లేక.. అరెస్ట్‌ చేస్తారా? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.