Begin typing your search above and press return to search.

మూడ్‌ని మార్చేసే టెక్నాలజీ ఇది

By:  Tupaki Desk   |   29 Jun 2015 7:48 AM GMT
మూడ్‌ని మార్చేసే టెక్నాలజీ ఇది
X
పట్ట పగలు.. మిట్ట మధ్యాహ్నం.. సూర్య కిరణాలు నడినెత్తిమీదికి దూసుకొస్తున్న వేళ.. అక్కడ ఓ అమ్మాయి-అబ్బాయి రొమాన్స్‌ .. ఇంతలోనే ఆకాశంలో కారుమబ్బులు ఆవరించాయి. పైనుంచి సుడులు తిరుగుతూ ఆ ఇద్దరి మీది నుంచి వెళ్లిపోయాయి. ఇదో సీన్‌. అక్కడ ఓ భీకరమైన యుద్ధం ముగిసింది. శత్రువులు ఊరు మొత్తాన్ని తగల బెట్టేశారు. ఆ ప్రాంతం మొత్తం ఎర్రబారింది. సముద్రం, నల్లని కారుమబ్బులు, ఎర్రని వాతావరణం.. ఇవన్నీ వాస్తవ ప్రపంచంలో చూడగలమా? ఛాన్సేలేదు.

నిజానికి ఇలాంటివన్నీ నిజ ప్రపంచంలో చూడలేం. వెండితెరపై మాత్రమే వీక్షించగలం. పెరిగిన డిజిటల్‌ టెక్నాలజీ పుణ్యమా అని కలర్‌ గ్రేడింగ్‌లో ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి. ఒక సీన్‌ని మామూలు వాతావరణంలో తెరకెక్కించి దాన్ని పూర్తిగా ఆపోజిట్‌ మూడ్‌లోకి మార్చేసే సత్తా కలర్‌ గ్రేడింగ్‌ టెక్నాలజీకి ఉంది. అప్పట్లో ముడి ఫిలిం నెగెటివ్‌ని ఉపయోగించేవారు. దానిపై ఏం ప్రింట్‌ అయితే అదే థియేటర్‌లో చూడాల్సిందే. దానికోసం ముందుగానే లైటింగ్‌ సెటప్‌ చేయాల్సొచ్చేది. ఆకాశం మేఘావృతమై ఉంది అంటే దానికి తగ్గట్టు లైట్లు సెట్‌ చేయాల్సిందే. ఇప్పుడు అలాంటి అవసరమే లేకుండా ఒక మామూలు సీన్‌ చుట్టూ మూడ్‌ని మార్చే కలర్‌ని పంప్‌ చేస్తున్నారు.

ఇలాంటి టెక్నాలజీని 300 సినిమాకోసం సమర్ధంగా ఉపయోగించారు. ఆ తర్వాత మళ్లీ అంతే సమర్ధంగా రాజమౌళి 'బాహుబలి' కోసం ఉపయోగించారని చెబుతున్నారు. ఇప్పటికే టీజర్లు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. బాహుబలి సినిమా చూశాక ఆ టెక్నాలజీ పవరెంతో మన తెలుగోళ్లకు కూడా తెలిసొస్తుంది. అసలు మూడ్‌ని మార్చేయడం అనే కొత్త పద్ధతికి అంకురార్పణ ఇది.