Begin typing your search above and press return to search.

సమరసింహారెడ్డి, సింహాద్రి ఎలా పుట్టాయి?

By:  Tupaki Desk   |   28 July 2015 11:14 PM GMT
సమరసింహారెడ్డి, సింహాద్రి ఎలా పుట్టాయి?
X
20 ఏళ్ల కిందట తెలుగులో వచ్చిన ఓ సినిమా ప్రేరణతో బాలీవుడ్ మూవీకి కొత్తగా కథ రాయడం.. దాన్ని అందరూ మెచ్చుకునేలా చేయడం సామాన్యమైన విషయం కాదు. ఈ ఘనత విజయేంద్ర ప్రసాద్ కే దక్కింది. భజరంగి భాయిజాన్ కథకు 80ల్లో వచ్చిన చిరంజీవి సినిమా ‘పసివాడి ప్రాణం’ ప్రేరణ అని భేషజం లేకుండా ఒప్పుకున్నారు విజయేంద్ర ప్రసాద్. ఐతే ఇదొక్కటే కాదని.. తన కథలు చాలా వాటికి పాత సినిమాలే ప్రేరణగా నిలిచాయని అంటున్నారు విజయేంద్ర ప్రసాద్. ఇలా స్ఫూర్తి పొందడంలో తప్పేమీ లేదంటారాయన. ‘‘ప్రేరణ లేకుండా కథ చేశారు అంటే వాళ్లు మహానుభావులు అంటాను. లేదంటే వాళ్లు అబద్ధం చెబుతున్నారు అనుకుంటాను’’ అంటూ ఒక్క ముక్కలో తేల్చేశారు విజయేంద్ర ప్రసాద్.

ఇంతకుముందు తాను ప్రేరణ పొందిన సినిమాల గురించి చెబుతూ.. ‘‘నా తొలి సినిమా కథ జానకి రాముడు.. మూగమనసులు ప్రేరణతో రాసింది. ఐతే ఇది నేను కావాలని చేసింది కాదు. రాఘవేంద్రరావుగారే అడిగి మరీ రాయించుకున్నారు. మూగమనసులు లాంటి కథ రాయి.. కానీ మూగమనసులు లాగా ఉండకూడదు అన్నారు. నేను రాసిన కథ ఆయన్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత సమరసింహారెడ్డి, సింహాద్రి కూడా వేరే కథల స్ఫూర్తితో పుట్టినవే. సమర సింహా రెడ్డి సినిమాకు ప్రేరణ సింధూరపువ్వు. అందులో సవతి తల్లి కొడుకు చాన్నాళ్ల తర్వాత ఊరికి వచ్చి తన చెల్లెళ్లకు పెళ్లి చేస్తాడు. ఆ ఆలోచన నుంచే సమరసింహారెడ్డి కథ పుట్టింది. ఇక వసంత కోకిల సినిమాలో హీరోయిన్ కు చివర్లో పిచ్చి వదిలాక హీరో మీద దాడి చేస్తుంది. ఆ సన్నివేశం స్ఫూర్తితో సింహాద్రి ఇంటర్వెల్ సీన్ రాసి కథ పూర్తి చేశా’’ అని చెప్పారు విజయేంద్ర ప్రసాద్.