సితార ఐదో సినిమా.. నాలుగో హీరో నాని

Thu Jun 14 2018 21:49:28 GMT+0530 (IST)

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై సినిమాలు నిర్మించే రాధాకృష్ణ.. సితార ఎంటర్టెయిన్మెంట్స్ ను కూడా రన్ చేస్తున్నారు. ఈ బ్యానర్ పై వరుసగానే సినిమాలు చేస్తున్నారు కూడా. ఇప్పటికే ఈ బ్యానర్ పై 4 సినిమాలు రాగా.. ఇప్పుడు ఐదో చిత్రానికి రంగం సిద్ధమయినట్లు తెలుస్తోంది.ఇప్పుడు నాని హీరోగా తమ కొత్త సినిమా నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నారట. గతంలో వీరు నాలుగు చిత్రాలను తెరకెక్కించారు. నాగ చైతన్యతో ప్రేమమ్.. వెంకటేష్ తో తీసిన బాబు బంగారం చిత్రాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. ప్రస్తుతం చైతు హీరోగా శైలజా రెడ్డి అల్లుడు.. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాలను నిర్మిస్తున్నారు. అంటే ఈ నాలుగు చిత్రాలలో ముగ్గురు హీరోలు కనిపించారన్న మాట. రెండు సినిమాలు సెట్స్ పై ఉండగా ముచ్చటగా మూడో మూవీని కూడా మొదలుపెట్టేసేందుకు రెడీ అయిపోతోంది సితార ఎంటర్టెయిన్మెంట్స్.

సుమంత్ తో మళ్లీ రావా చిత్రాన్ని తీసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. ఇప్పుడు నానితో మూవీ చేయనున్నాడట. ఆ సినిమా ఫెయిల్ అయినా.. మేకింగ్ విషయంలో దర్శకుడికి మంచి గుర్తింపే వచ్చింది. రీసెంట్ గా ఇతడు చెప్పిన స్టోరీ రాధాకృష్ణకు నచ్చడం.. వెంటనే దీన్ని నాని కి సజెస్ట్ చేయడం.. న్యాచురల్ స్టార్ కూడా ఓకే చెప్పేయడంతో.. చకచకా ప్రీ ప్రొడక్షన్ పనులకు ముహూర్తం పెట్టేశారట. త్వరలో ఈ ప్రాజెక్టుపై ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలున్నాయి.