పెద్ద సినిమాలతో పూరి పోటీపడతాడా?

Thu Feb 15 2018 05:00:01 GMT+0530 (IST)

టాలీవుడ్ స్పీడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఈ మధ్య ఫెయిల్యూర్స్ ఎక్కువగా అందుకున్నప్పటికీ సినిమాల్లో ఎదో ఒక అంశాన్ని బలంగా దించేస్తాడు. తాను అనుకున్న స్క్రిప్ట్ ని కరెక్ట్ గా దించేయడంలో పూరి తరువాతే ఎవరైనా. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా పూరి సినిమాలను స్పెషల్ గా ఇష్టపడే వారు ఇంకా ఉన్నారంటే ఆయన పెన్ పవర్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అయితే మొన్నటి వరకు ఎంతో మంది స్టార్స్ తో వర్క్ చేసిన పూరి జగన్నాథ్ మొదటి సారి తన కుమారుడిని పర్ఫెక్ట్ హీరోగా చూపించబోతున్నడు.ఇండో - పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతోన్న మెహబూబా అనే ఆ లవ్ స్టోరీ టీజర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని అందరు చర్చించుకుంటున్నారు. కొన్ని రూమర్స్ వస్తున్నప్పటికి ఇంకా అధికారికంగా ఎలాంటి న్యూస్ రాలేదు. అయితే ఫైనల్ గా సినిమాను పూరి సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఏప్రిల్ ఎండింగ్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే సమ్మర్ లో ఎప్పుడు రిలీజ్ చేయాలని అనుకున్నా కొంచెం కష్టమే. మార్చ్ ఎండింగ్ నుంచి మే వరకు ప్రతి వారనికి లేదా రెండు వారాల గ్యాప్ లో పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

రామ్ చరణ్ బన్నీ మహేష్ రజినీకాంత్ వంటి స్టార్ హీరోలు సమ్మర్ కోసమే వెయిట్ చేస్తున్నారు. నాని లాంటి మరికొంత మంది హీరోలు కూడా సమ్మర్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. డబ్బింగ్ సినిమాలు కూడా బాగానే వస్తాయి. మరి ఈ రసవత్తరమైన పోటీలో పూరి జగన్నాథ్ తన మెహబూబా సినిమాను రిలీజ్ చేసి కొడుకు ఆకాష్ కి హిట్ ఇస్తాడో లేదో చూడాలి. ఇక సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా సందీప్ చౌతా మ్యూజిక్ అందించాడు.