Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ మారే సమస్యే లేదు

By:  Tupaki Desk   |   21 Feb 2018 10:23 AM GMT
రాజ్ తరుణ్ మారే సమస్యే లేదు
X
ఉయ్యాలా జంపాలతో పరిచయమై కుమారి 21 ఎఫ్ తో కుర్రాళ్ళకు బాగా కనెక్ట్ అయిపోయిన హీరో రాజ్ తరుణ్ టైం ప్రస్తుతం ఏమంత బాగా లేదు. గత ఏడాది చేసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు ఒకదాన్ని మించి ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర పేలిపోవడంతో పాటు అన్నపూర్ణ బ్యానర్ లో సంక్రాంతికి చేసిన రంగుల రాట్నం వారం ఆడకుండానే తిరిగి రావడం రాజ్ తరుణ్ స్పీడ్ కి పెద్ద బ్రేక్ వేసింది. కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నప్పటికి దర్శకుల వైఫల్యం కూడా రాజ్ తరుణ్ పరాజయాలకు కారణంగా మారుతోంది. ప్రస్తుతం రాజుగాడు అనే సినిమా ఫినిషింగ్ కు దగ్గరలో ఉంది కాని అసలు అది ఎప్పుడు విడుదల అవుతుందో మినిమం అప్ డేట్స్ కూడా యూనిట్ ఇవ్వడం లేదు. నిజానికి రంగుల రాట్నం స్థానంలో రాజుగాడు రావలసింది. కాని ఉన్నట్టుండి ప్లాన్ మార్చేసారు.

తన కెరీర్ కు మేజర్ బ్రేక్ ఇచ్చిన కుమారి 21 ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ తో రాజ్ తరుణ్ మరో సినిమా చేయబోతున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రవితేజతో నేలటికేట్ నిర్మిస్తున్న రామ్ తుల్లురి దీనికి నిర్మాత. గత కొద్ది రోజులుగా రాజ్ తరుణ్ ఈ సినిమా చేయటం లేదని - వేరే యూత్ హీరోని ఇందులో కోసం ఎంచుకున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో వాటికి చెక్ పెడుతూ నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. సూర్య ప్రతాప్ చెప్పిన కథ రాజ్ తరుణ్ ని ఇంప్రెస్ చేసిందని, హీరో మారాడు అనే వార్త వట్టి పుకారే అని కొట్టి పారేశారు. స్క్రిప్ట్ పూర్తి కాగానే సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చేసాడు.

రాజ్ తరుణ్ కి హిట్ అవసరం చాలా ఉంది. హ్యాట్రిక్ ఫ్లాప్ వచ్చిన నేపధ్యంలో కుర్రాడి స్పీడ్ కాస్త తగ్గింది. ఒకపక్క నెలకో యూత్ హీరో వస్తున్నాడు. ఎవరిది ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందుకే మేజర్ బ్రేక్ అవసరం రాజ్ తరుణ్ కి ఎంతైనా ఉంది. మరి ఆ కొరత రాజుగాడు తీరుస్తాడో లేదో వేచి చూడాలి. మార్చ్ చివరి వారంలో సూర్య ప్రతాప్ తో సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.