‘కాలా’ను బాగానే దెబ్బ కొట్టింది

Wed Jun 13 2018 13:57:39 GMT+0530 (IST)

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఆయన కొత్త సినిమా ‘కాలా’కు విడుదలకు ముందు అసలేమాత్రం బజ్ రాలేదు. బుకింగ్స్ తీవ్ర నిరాశకు గురి చేశాయి. విడుదల తర్వాత టాక్ అంతంతమాత్రంగా రావడంతో ఓపెనింగ్స్ పేలవంగా వచ్చాయి. తొలి వారాంతంలో కేవలం 7 కోట్ల లోపు షేర్ రావడం విస్మయ పరిచే విషయం. తెలుగు రాష్ట్రాల్లో రజనీ సినిమాకు మామూలుగా తొలి రోజే ఇంతకంటే ఎక్కువ వసూళ్లు వస్తాయి. ఫుల్ రన్లో ఈ చిత్రానికి రూ.10 కోట్ల షేర్ రావడం కూడా కష్టంగానే ఉంది. తెలుగులో మరే సినిమా పోటీలో లేకపోయినప్పటికీ ‘కాలా’కు ఇలాంటి వసూళ్లు రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. తెలుగు రాష్ట్రాలనే కాదు.. తమిళనాడు మినహాయిస్తే దేశవ్యాప్తంగా ‘కాలా’ పరిస్థితి ఇలాగే ఉంది. తెలుగు.. హిందీ భాషల్లో ‘కాలా’ డిజాస్టర్ అని తేలిపోయింది.‘కాలా’కు పోటీగా విడుదలైన హాలీవుడ్ డబ్బింగ్ సినిమా ‘జురాసిక్ వరల్డ్: ది ఫాలెన్ కింగ్డమ్’ దీన్ని బాగానే దెబ్బ కొట్టినట్లుంది. నిజానికి ‘జురాసిక్ వరల్డ్’ సినిమాకు ఆశించినంత మంచి టాక్ ఏమీ రాలేదు. దీనిపై విమర్శకులు పెదవి విరిచారు. అయినప్పటికీ ఆ చిత్రం ఇండియాలో మంచి ఓపెనింగ్సే తెచ్చుకుంది. తొలి వారాంతంలో అది దేశవ్యాప్తంగా రూ.55 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ‘కాలా’ వసూళ్లకు దాదాపుగా ఇది సమానం. రజనీ సినిమాకు పోటీగా బాలీవుడ్ వాళ్లు కూడా సినిమాలు రిలీజ్ చేయరు. దక్షిణాది అంతటా సూపర్ స్టార్ సినిమాకు ఆ రేంజిలో హంగామా ఉంటుంది. ఉత్తరాదిన కూడా ఆయన సినిమాలు ప్రభావం చూపిస్తుంటాయి. అలాంటిది ‘జురాసిక్ వరల్డ్’ దానికి పోటీగా విడుదలై.. నెగెటివ్ టాక్ ను కూడా తట్టుకుని ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం విశేషమే.