డబ్బుల్లేని పవన్ నం.1 ఎలా అయ్యాడు?

Thu Dec 06 2018 20:00:02 GMT+0530 (IST)

ఈ ఏడాదే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయన ఎప్పుడు పబ్లిక్ మీటింగులకు వెళ్లినా.. బీద అరుపులు అరుస్తుంటాడు. తన దగ్గర డబ్బుల్లేవంటాడు. రాజకీయాల్లోనూ కూడా డబ్బులు ఖర్చు పెట్టలేనని అంటాడు. సినిమాల ద్వారా పెద్దగా ఏమీ సంపాదించలేదంటాడు. కానీ తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ సెలబ్రెటీ శ్రీమంతుల జాబితాలో పవన్ టాలీవుడ్ నుంచి నంబర్ వన్ స్థానంలో నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పవన్ అసలు ఈ ఏడాది సినిమాలే చేయలేదు. ‘అజ్ఞాతవాసి’ విడుదలైంది ఈ ఏడాది జనవరిలో. మరి దాని తాలూకు ఆదాయాన్ని ఫోర్బ్స్ వాళ్లు ఈ ఏడాది కే లెక్కగట్టారో ఏమో తెలియదు. ఒక వేళ ఆ రెమ్యూనరేషన్ 2018 లెక్కల్లోకే వచ్చినా కూడా పవన్ అగ్రస్థానంలో నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.పవన్ కు దీటుగా పారితోషకం తీసుకుంటూనే తీరిక లేకుండా ప్రకటనల్లో నటిస్తుంటాడు మహేష్. అతడి చేతి లో రెండంకెల సంఖ్యలో బ్రాండ్లు ఉన్నాయి. మహేష్  ఈ ఏడాదే ‘భరత్ అనే నేను’తో పలకరించాడు. ‘మహర్షి’ కూడా చేస్తున్నాడు. మరి అలాంటివాడు పవన్ కంటే తొమ్మిది స్థానాలు తక్కువలో ఉన్నాడు. మరి మహేష్ కంటే తొమ్మిది స్థానాలు ఎక్కువగా ఉండేంతగా ఎంత ఆదాయం అందుకున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. ‘అజ్ఞాతవాసి’కి ఏకంగా రూ.40 కోట్ల దాకా పవన్ పారితోషకం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

ప్రస్తుత ఫోర్బ్స్ లిస్టు చూస్తే ఆ వార్తలు నిజమే అనిపిస్తున్నాయి. మరి ఆ సినిమా వల్ల నష్టాల పాలైన వారికి పవన్ ఏమీ వెనక్కి ఇవ్వనట్లే అని కూడా అనుకోవాలి. ఏదేమైనప్పటికీ ఓవైపు పదే పదే తన దగ్గర డబ్బుల్లేవనే పవన్.. ఫోర్బ్స్ లిస్టులో ఇలా నంబర్ వన్ గా నిలవడం మాత్రం ఇబ్బందికర పరిణామమే. ఇకపైనా తన సభల్లో పవన్ అదే బీద అరుపులు అరుస్తాడేమో చూడాలి.