Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పెద్దలకు మరో ఝలక్

By:  Tupaki Desk   |   16 April 2018 11:37 AM GMT
టాలీవుడ్ పెద్దలకు మరో ఝలక్
X
తమిళ సినీ పరిశ్రమలో సమస్యల మీద అక్కడి వాళ్లందరూ ఎంత ఉమ్మడిగా ఉంటూ సమ్మె నడిపిస్తున్నారో చూస్తూ ఉన్నాం. దెబ్బకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల పునాదులు కదులుతున్నాయి. మార్కెట్లోకి కొత్త ప్లేయర్లు వస్తున్నారు. వారితో ఒప్పందాలు జరుగుతున్నాయి. త్వరలోనే సమస్య పరిష్కారమయ్యేలా కనిపిస్తోంది. ఐతే మన దగ్గర కూడా సమ్మె జరిగింది కానీ.. ఏమైంది?వారం తిరక్కుండానే థియేటర్లు తెరుచుకున్నాయి. మన నిర్మాతలు సాధించిందేమీ లేదు. తమిళ సినీ పరిశ్రమ జల్లికట్టు గొడవ తలెత్తినపుడు కూడా ఎంత సంఘటితంగా ఉందో తెలిసిందే. కానీ మన దగ్గర అలాంటి ఐకమత్యం ఏమీ కనిపించదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఇంత గొడవ జరుగుతున్నా మాట్లాడే నాథుడు లేడు.

ఎవరితో ఎవరూ సంప్రదించరు. ఎవరి తీరుగా వారుంటారు. ఆ మధ్య రాఘవేంద్రరావు సహా కొందరు సినీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సినీ పరిశ్రమ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే నిజానికి సినీ పరిశ్రమలో మిగతా వాళ్లతో ఏ సంప్రదింపులూ జరపకుండానే వాళ్లు వెళ్లి చంద్రబాబును కలిసినట్లు స్పష్టమవుతోంది. కలిస్తే కలిశారు కానీ.. పరిశ్రమ మొత్తం చంద్రబాబు వెనుక ఉన్నట్లుగా కలరింగ్ ఇవ్వడమే వివాదాస్పదమైంది. దీనిపై ఇప్పటికే నటుడు.. రచయిత పోసాని కృష్ణమురళి ఇండస్ట్రీ పెద్దలకు కొన్ని ప్రశ్నలు సంధించాడు. ఇప్పుడు సీనియర్ నటుడు విజయ్ చందర్ సైతం దీనిపై ప్రశ్నించాడు. చంద్రబాబు చేపట్టిన ప్రత్యేక హోదా ఉద్యమానికి సినీ పరిశ్రమ మద్దతు తెలిపిందన్న వార్తలపై పరిశ్రమ పెద్దలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. నిర్మాత కౌన్సిల్లో దీనిపై తాను స్పష్టత కోరానని.. అడ్ హక్ కమిటీ ఛైర్మన్ నారాయణ మాత్రం.. ఇది కేవలం వ్యక్తిగత మద్దతే అని చెప్పారని ఆయన వెల్లడించారు. చంద్రబాబును కలిసిన మిగతా నలుగురు కూడా దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. సేవా కార్యక్రమాల్లో మాత్రమే సినీ పరిశ్రమ ఏకతాటిపై ఉంటుందని.. రాజకీయ అంశాల్లో ఎవరి నిర్ణయం వారిదే అని ఆయన అన్నారు.