Begin typing your search above and press return to search.

మద్యం మత్తులో యువనటుడి వీరంగం

By:  Tupaki Desk   |   11 Nov 2018 7:12 AM GMT
మద్యం మత్తులో యువనటుడి వీరంగం
X
యువ నటుడు ఉదయ్ కిరణ్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఏకంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి హల్ చల్ చేశాడు. తన స్నేహితురాలితో కలిసి పోలీస్ స్టేషన్ లోని కంప్యూటర్ రికార్డులను ధ్వంసం చేశాడు. పోలీసుపై దాడికి కూడా పాల్పడ్డాడు. వీరిద్దరిపై కేసులు నమోదు చేశామని.. ఉదయ్ కిరణ్ పై పీడీ చట్టం ప్రయోగించామని మాదాపూర్ డీసీపీ ఏ వెంకటేశ్వరరావు తెలిపారు.

బంజరాహిల్స్ లో నివాసం ఉండే యువనటుడు ఉదయ్ కిరణ్ శుక్రవారం రాత్రి తన ఢిల్లీకి చెందిన స్నేహితురాలు అనుగుప్తాతో కలిసి ఓ పబ్ లో శుక్రవారం రాత్రి మద్యం తాగారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో కారులో ఇద్దరూ మాదాపూర్ వైపు వస్తున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో నిఖిల్ అనే వ్యక్తి చెందిన కారును ఢీకొట్టారు. అనంతరం నిఖిల్-ఉదయ్ కిరణ్ గొడవపడి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ నిఖిల్ పై ఉదయ్ దాడికి ప్రయత్నించాడు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ అడ్డుకోబోగా అతడిపై కూడా ఉదయ్ దాడి చేశాడు. అనుగుప్తా కూడా స్టేషన్ లో పోలీసులను తిడుతూ కంప్యూటర్ ను ధ్వంసం చేసి పలు రికార్డులను చించేసింది. వీరిని అదుపులోకి తీసుకొని పోలీసులు డ్రంకెన్ టెస్ట్ నిర్వహించగా ఉదయ్ కిరణ్ కు 137 - అనుగుప్తాకు 122 మిల్లీగ్రాముల అల్కహాల్ శాతం ఉందని ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు.

కాకినాడకు చెందిన ఉదయ్ కిరణ్ హైదరాబాద్ లో ఉంటూ పరారే, యువరాజ్యం - ఫేస్ బుక్ - రాక్షసులు సినిమాల్లో నటించాడు. ఇతడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండడంతో ఇదివరకే 13కేసులు - కాకినాడలో 9 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 2016లో పీడీ యాక్ట్ నమోదు కావడంతో సంవత్సరం జైల్లో ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చి మరోసారి మద్యం తాగి రచ్చ చేసి దొరికిపోయాడు.