ఎయిర్ పోర్ట్ లో ఆ హీరోయిన్ కు 'ముద్దు' షాక్

Thu Dec 07 2017 16:32:42 GMT+0530 (IST)

నిజానికి ఇలాంటి కష్టం ఏ హీరోయిన్‌కు రాకూడదేమో. దురదృష్టవశాత్తు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఆదాశర్మకు ఎదురైంది. ఇటీవల ఆమె ముంబయి ఎయిర్ పోర్ట్ లో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమెను చూసిన ఒక అభిమాని ఆమె వద్దకు వెళ్లారు. ఆదా తన కుమార్తె లాంటిదానివని పేర్కొంటూ.. తనకో ముద్దు ఇవ్వాలంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఊహించని ఈ పరిణామానికి ఆదా షాక్ తింది. అప్పటికి తన మనసులోని కష్టాన్ని ముఖంలోకి తీసుకురాకుండా జాగ్రత్త పడుతూ నవ్వుతూ వెళ్లిపోయారు. అయినప్పటికీ ఆ వ్యక్తి అక్కడితో ఆగకుండా.. సినిమాల్లో అయితే ముద్దు పెడతావ్.. నాకు పెట్టవా? అంటూ గట్టిగా కేకలు వేశాడు. అతడి పిచ్చి ప్రేలాపనల్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ చేసేశారు.

అంతే అప్పటి నుంచి ఆదాకు కొత్త సలహాలు రావటం మొదలయ్యాయి. ఆ పెద్ద మనిషి అడిగింది ఇవ్వటానికి ఇబ్బందేమిటి?  అంటూ ప్రశ్నించటం మొదలు పెట్టారు. దీంతో చిరాకు పడిన ఆదా ట్విట్టర్ లో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తనకు సలహాలు ఇస్తున్న వారిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గడిచిన మూడేళ్లలో తాను ట్విట్టర్ లో ఉన్నప్పటికీ ఎప్పుడూ ఇంత ఆగ్రహంగా తాను కామెంట్ చేయలేదని.. కానీ.. తనపై వస్తున్న విమర్శలకు తప్పలేదన్నారు.

ముద్దు ఇస్తే పోయేదేముంది? అంటూ కామెంట్లు పెడుతున్నారన్న ఆమె.. తన జీవితంలో ఏది పెద్ద విషయం? ఏది చిన్న విషయం? అన్నది నిర్ణయించుకోవటానికి మీరెవరు? అంటూ ప్రశ్నించారు. అసలు తాను ఎవరిని ముద్దు పెట్టుకోవాలో.. ఎవరిని పెట్టుకోకూడదో చెప్పటానికి మీరెవరు? అంటూ నిలదీసింది.

పరిచయం లేని వ్యక్తి నన్ను కలిసి ముద్దు ఇవ్వు అంటే చెప్పు దెబ్బ తింటారన్నారు. హార్ట్ ఎటాక్ చిత్రంలో హయాతి ముద్దు ఇచ్చిందని.. కమాండో 2లో భావనా రెడ్డి ముద్దు ఇచ్చిందని.. అవన్నీ తాను ప్రదర్శించిన పాత్రలని.. రీల్ పాత్రలకు..రియల్ పాత్రకు వ్యత్యాసం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని క్లాస్ పీకింది.

తనకు అందరి పట్ల గౌరవం ఉందని.. తన జీవితంలోనూ తండ్రి.. తాతయ్య.. స్నేహితులు.. దర్శకులు.. నటులు అందరూ ఉన్నారని.. తాను పురుషులకు వ్యతిరేకం కాదని.. కానీ సినిమాల్లో ముద్దు పెట్టాను కాబట్టి నిజజీవితంలోనూ ముద్దు పెట్టమని అడగటం ఏమిటని ప్రశ్నించారు. 1920 చిత్రంలో  తాను దెయ్యం పాత్రను పోషించానని.. రాత్రిళ్లు చాలామందిని ఆ సినిమాలో చంపేశానని.. అంటూ రీల్ కు రియల్ కు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలన్న విషయాన్ని ఒకింత ఆగ్రహంతో చెప్పేశారు ఆదా. నిజమే.. ఆమె బాధను అర్థం చేసుకోవాల్సిందే.