సినిమా వాళ్లనెందుకు లాగుతావ్..?

Wed Sep 13 2017 16:22:37 GMT+0530 (IST)

వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేయాల్సి వస్తే.. అందరూ రాహుల్ గాంధీని ఉదాహరణగా తీసుకుంటారు. రాజకీయాల్లోకి వచ్చి రెండు దశాబ్దాలవుతున్నా ఇప్పటికా రాహుల్ సొంతంగా నిరూపించుకున్నదేమీ లేదు. ఎప్పుడూ నెగెటివ్ విషయాలతోనే అతను వార్తల్లో నిలుస్తుంటాడు. అప్పుడప్పుడు అనాలోచితమైన వ్యాఖ్యలు చేస్తూ.. అనవసరంగా వివాదాల్లో ఇరుక్కుంటుంటాడు సోనియా తనయుడు. తాజాగా అతను వారసత్వ రాజకీయాలతో తప్పేంటన్న ఉద్దేశం వచ్చేలా మాట్లాడాడు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రసంగిస్తున్న సమయంలో వారసత్వ రాజకీయాల ప్రస్తావన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాల్ని పెంచి పోషించిందన్న విమర్శలపై ఏమంటారని అడిగితే.. కాంగ్రెస్ పార్టీలోనే కాక అన్ని చోట్లా వారసత్వం ఉందని.. అఖిలేష్ యాదవ్.. స్టాలిన్.. అభిషేక్ బచ్చన్.. అంబాని.. లాంటి వాళ్లను ఉదాహరణగా చూపించాడు.ఐతే వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడితే.. అభిషేక్ బచ్చన్ పేరు చెప్పి సినిమా వాళ్లను లాగడంపై బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ మండిపడ్డాడు. తమ కపూర్ కుటుంబం గురించి చెబుతూ.. తమ ఫ్యామిలీకి చెందిన నాలుగు తరాల నటులు తమ ప్రతిభతో నిలదొక్కుకున్నారని.. జనాల గౌరవం పొందామని.. కేవలం వారసత్వం వల్ల తాము ఇండస్ట్రీల్లో ఉండట్లేదని అన్నాడు. వారసత్వం ద్వారా జనాల మీద రుద్దడం కాకుండా.. జనాల గౌరవం.. ప్రేమ సంపాదించాలని.. అధికారం గూండాగిరీ చూపించకూడదని అన్నాడు రిషి కపూర్. రాహుల్ పేరెత్తకపోయినప్పటికీ రిషి కపూర్ విమర్శలు అతడి వ్యాఖ్యల్ని ఉద్దేశించే అని అర్థమవుతోంది.