Begin typing your search above and press return to search.

మరో సైరా.. కొక్కంటి పాలెగాడు..

By:  Tupaki Desk   |   14 Oct 2019 4:58 AM GMT
మరో సైరా.. కొక్కంటి పాలెగాడు..
X
అది రాయల ఏలిన అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతం.. కుక్కలను కుందేళ్లు తరిమికొట్టిన బిరుసుగడ్డ. ఆ కుక్కల్లు కాస్తా కాలక్రమంలో కొక్కల్లుగా మారాయంటారు.. అది ‘కొక్కంటి’గా మారిందని చెబుతుంటారు. ‘కొక్కంటి’ సంస్థానాధీశుడు ఎర్రివీర నాగముని మల్లప్ప నాయుడు తన ఇద్దరు అనుచరులు పెద్ద గుబిలి - చిన్నగుబిలిలతో చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావని కథలు కథలుగా చెబుతుంటారు. బ్రిటీషర్లు పెట్టిన పోటీలో ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టి విజేతగా నిలిచారు.. అప్పుడు నాటి బ్రిటీషర్లు కొక్కల్లు సంస్థానానికి మరో 72 పాళ్యాలను (గ్రామాలను) ఇచ్చి పోతుపాళ్యంగా ప్రకటించారు. నజరానా కింద ఏలుకోమన్నారు. ఇదీ మన రాయలసీమలోని అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలోని ‘కొక్కంటి’ ప్రాంత పాలెగాళ్ల కథ.. సైరా నరసింహారెడ్డిలోని ఉయ్యాలవాడ నరసింహరెడ్డి వలే కొక్కంటి పాలెగాళ్లకు వీరోచిత చరిత్ర ఉంది.

కొక్కల్లు సంస్థానం కూడా పాలెగాళ్ల చేతుల్లో ఉండేది. ఇక్కడ రెండో తరం నాయకుడు వీరమల్లప్ప నాయుడు నాడి బ్రిటీష్ కలెక్టర్ థామస్ మన్రోను అతలాకుతలం చేసిన పెద్దపల్లిని ఒక్క దెబ్బతో స్వయంగా పోరాడి నేలకూల్చాడట..

కొక్కల్లు పాలెగాళ్లు పౌరుషాలకు - ప్రతిష్టలకే పరిమితం కాకుండా పాలనాదక్షత - ప్రజాసంక్షేమానికి పాటుపడ్డారని చరిత్ర చెబుతోంది. వీరి ఏలుబడిలో నాడు బ్రిటీషర్లు - పోలీసులు భయపడి వచ్చేవారే కాదట.. వీరు ఏర్పాటు చేసిన ‘అజారా’ పంచాయతీలు ఇప్పటికీ రాయలసీమ ప్రజల మనసుల్లో ఉన్నాయి. పాలెగాల్లు ఇక్కడ పంచాయతీ నిర్వహించేవారట.. కదిరి చుట్టుపక్కల వీరు నిర్మించిన పెద్దనాయుని చెరువు, తిమ్మనాయుడి చెరువు, నారప్ప నాయుడి చెరువు పాలెగాళ్ల పేర్లతో పెట్టినవే..

కదిరి కొండల నడుమ కోట ఇప్పటికీ ఉంది. వీరి ఇలవేల్పు మల్లికార్జున స్వామి. నాలుగుతరాల పాలెగాళ్ల కుటుంబంలో ఎర్రివీర నాగముని మల్లప్ప నాయుడు కొక్కల్లు సంస్థానాధీశుడిగా మంచి పాలన అందించారు. పాలెగాళ్లు ప్రారంభించిన కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో జ్యోతిని పాలెగాళ్ల ఇంటినుంచి తీసుకువచ్చే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. తిమ్మమ్మమర్రిమాను ఖ్యాతి నాటి పాలెగాళ్లదేనట.. బ్రిటీష్ వారు ఈ పాలెగాళ్ల సంస్థానాలను విలీనం చేసుకొని వారికి భరణంగా రూ.5 జాగిర్దార్ పెన్షన్ ఇచ్చేవారట..

అలా సైరా సినిమా వచ్చాక రాయలసీమ పాలెగాళ్ల పౌరుషం - చరిత్ర - పాలనా దక్షత ప్రపంచానికి తెలియవచ్చింది. కదిరిలోని కొక్కంటి పాలెగాళ్ల ఖ్యాతి కూడా ఎనలేనిది..