'యాత్ర' సెన్సార్ రిపోర్ట్

Tue Jan 22 2019 22:31:13 GMT+0530 (IST)

టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ లు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' ను మహి వి రాఘవ తెరకెక్కించిన విషయం తెల్సిందే. రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలోని కీలక ఘట్టమైన పాదయాత్రకు సంబంధించిన విషయాన్ని కీలకంగా తీసుకుని యాత్రను తెరకెక్కించడం జరిగింది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముటీ నటించగా - కీలక పాత్రలో జగపతిబాబు - అనసూయ - సుహాసిని ఇంకా ప్రముఖులు నటించారు. వచ్చే నెల 8న ఈ చిత్రం విడుదలకు రంగం సిద్దం అయ్యింది.'యాత్ర' సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నేడు సెన్సార్ ముందుకు వెళ్లింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యూ ఇచ్చినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. టైటిల్ కార్డ్ నుండి ఎండ్ కార్డ్ వరకు సినిమా పూర్తి నిడివి రెండు గంటల ఆరు నిమిషాలు వచ్చిందట. మొదట రెండు గంటలకు లోపు అంటూ వార్తలు వచ్చాయి. అయితే టైటిల్స్ మరియు క్లైమాక్స్ ఎండ్ కార్డ్ ఇలా మొత్తం కలిపి రెండు గంటల ఆరు నిమిషాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

సెన్సార్ బోర్డు నుండి 'యాత్ర' చిత్రంకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని ఆయన అభిమానులను అలరించేలా చూపించారంటూ కామెంట్ చేశారట. వైఎస్ అభిమానులతో పాటు - అన్ని వర్గాల వారిని కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకంను చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 8న పెద్దగా సినిమాల్లేని కారణంగా భారీగానే ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.