Begin typing your search above and press return to search.

అయ్యో వైవీఎస్.. థియేటర్ సీజ్ చేశారు

By:  Tupaki Desk   |   4 Feb 2016 10:54 AM GMT
అయ్యో వైవీఎస్.. థియేటర్ సీజ్ చేశారు
X
ఆత్మవిశ్వాసం ఉండొచ్చు.. కానీ అతి విశ్వాసం ఉండకూడదంటారు. వైవీఎస్ చౌదరి ఈ అతి విశ్వాసంతోనే నిండా మునిగిపోయాడు. గతంలో ఆయన చేసిన రిస్కులు మంచి ఫలితాన్నిచ్చి ఉండొచ్చు. కానీ గత కొన్నేళ్లుగా తన సినిమాల పరిస్థితి ఏంటో చూసుకుని కాస్త జాగ్రత్త పడాల్సింది. కానీ ఆయన అతి విశ్వాసంతో మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ మీద భారీ పెట్టుబడి పెట్టేశాడు. అనుకోని అవాంతరాలన్నీ తోడై ఆ సినిమా బాగా ఆలస్యమైపోయింది. వడ్డీలు తడిసి మోపెడయ్యాయి. సినిమా ఎట్టకేలకు గత ఏడాది విడుదలైనా.. దారుణమైన ఫలితం వచ్చింది. డబ్బులు వెనక్కి రాలేదు. దీంతో చౌదరి నిండా మునిగిపోయాడు. తక్కువలో తక్కువ పాతిక కోట్ల దాకా నష్టం భరించాల్సి వచ్చింది చౌదరి.

ఈ పరిస్థితుల్లో చేసిన అప్పులు తీర్చక గుడివాడలో చౌదరికి ఎంతో ఇష్టంగా బొమ్మరిల్లు పేరుతో కట్టుకున్న జంట థియేటర్లను కూడా సీజ్ చేసే పరిస్థితి వచ్చిందిప్పుడు. ‘రేయ్’ సినిమా కోసం చౌదరి ఈ రెండు థియేటర్లను తాకట్టు పెట్టి ఆంధ్రా బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. ఐతే ‘రేయ్’ సినిమా డబ్బులు వెనక్కి తేవకపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. దీంతో ఆంధ్రా బ్యాంకు యాజమాన్యం వారు గురువారం ఈ ధియేటర్లను స్వాధీనం చేసుకున్నారు. చౌదరి పరిస్థితి చూస్తుంటే ఆ తర్వాతైనా అప్పు తీరుస్తాడని గ్యారెంటీ లేకపోవడంతో ఈ థియేటర్లు వేలం పాటలో ఎవరికో సొంతమవడం ఖాయంగా కనిపిస్తోంది. పాపం ‘రేయ్’ సినిమా చౌదరిని ఎంత పెద్ద దెబ్బ కొట్టిందో కదా.