Begin typing your search above and press return to search.

సంక్రాంతి బ‌రిలోకి `యాత్ర‌`

By:  Tupaki Desk   |   23 July 2018 7:09 AM GMT
సంక్రాంతి బ‌రిలోకి `యాత్ర‌`
X
ఈసారి సంక్రాంతికి బాక్సాఫీసు ద‌గ్గ‌ర గ‌ట్టి పోటీనే ఉండేలా క‌నిపిస్తోంది. పండ‌క్కి విడుదల‌య్యే సినిమాల జాబితా అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇప్ప‌టికే రామ్‌ చ‌ర‌ణ్ - బాల‌కృష్ణ సినిమాల‌తో పాటు - వెంక‌టేష్‌ - వ‌రుణ్‌ తేజ్‌ ల `ఎఫ్‌2` కూడా సంక్రాంతికి రానున్న‌ట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. తాజాగా `యాత్ర` కూడా సంక్రాంతికే బెర్తుని ఖ‌రారు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. వై.య‌స్‌.రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి బయోపిక్‌ గా తెరకెక్కుతున్న చిత్ర‌మిది. మ‌మ్ముట్టి ముఖ్య‌భూమిక పోషిస్తున్నారు. మామూలుగా సంక్రాంతి మ‌న‌కు పెద్ద పెండ‌గ కాబ‌ట్టి ఆ స‌మ‌యంలో ఎన్ని సినిమాలొచ్చినా జ‌నాలు చూస్తారనే ఓ అభిప్రాయం ఉంది.

ఆ సీజ‌న్‌ లో నాలుగు సినిమాల వ‌ర‌కు విడుద‌లయిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే మ‌రీ పెద్ద సినిమాలు - స్టార్ హీరోల సినిమాలు విడుద‌లైతే కొంచెం క‌ష్ట‌మే. అన్ని చిత్రాల‌కి స‌రిప‌డా థియేట‌ర్లు దొర‌క‌డం క‌ష్ట‌మ‌వుతుంది. కానీ అదేమీ ప‌ట్టించుకోకుండా నిర్మాత‌లు సంక్రాంతి బ‌రిలో మేమంటే మేం అంటూ ముందుకొస్తున్నారు. మ‌రి అప్ప‌ట్లోపు ఆయా సినిమాలు పూర్త‌వుతాయో లేదో చూడాలి. సినిమాలు ఇంకా సెట్స్‌ పై ఉన్నా - తీయాల్సింది చాలా ఉన్నా... మంచి తేదీ కాబ‌ట్టి ఎలాగో అప్ప‌ట్లోపు పూర్త‌యితే మంచి సీజ‌న్‌ లో మ‌న సినిమా వ‌స్తుంద‌ని భావిస్తూ నిర్మాత‌లు సంక్రాంతి బెర్తుల‌పై క‌ట్చీఫ్ వేసేస్తున్నారు. విశ్లేష‌కులు మాత్రం ఎన్ని సినిమాలు విడుద‌ల తేదీల్ని ప్ర‌క‌టించినా అప్పుడు ప్రేక్ష‌కుల ముందుకొచ్చే స్టార్ హీరోల సినిమాలు రెండింటికి మించ‌వ‌ని చెబుతున్నారు. `యాత్ర`ని మాత్రం నిర్మాత‌లు సంక్రాంతికే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నే సంక‌ల్పంతో చ‌క‌చ‌కా ప‌నులు చేస్తున్నారు. మ‌మ్ముట్టి కూడా మ‌ల‌యాళం చిత్ర ప‌రిశ్ర‌మ స్టైల్‌ లోనే గ్యాప్ లేకుండా ఏక‌ధాటిగా చిత్రీక‌ర‌ణ జ‌రిగేలా డేట్లు కేటాయించేశారు. దాంతో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.