'యాత్ర' పై విజయమ్మ స్పందన

Mon Feb 11 2019 18:34:03 GMT+0530 (IST)

వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన 'యాత్ర' చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముటీ ఈ చిత్రంలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించారు. నిజంగా రాజశేఖర్ రెడ్డి లా ఆయన ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. సినిమాలో ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం ఎంతగా తాపత్రయ పడ్డారో చూపించారు. అద్బుతమైన సీన్స్ తో గుండెలను పిండే సన్నివేశాలతో దర్శకుడు మహి వి రాఘవ చిత్రాన్ని తెరకెక్కించారు.'యాత్ర' సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో రాజశేఖర్ రెడ్డి అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైఎస్ ఆర్ సతీమణి విజయమ్మ సినిమాను చూశారు. సినిమా చూసిన తర్వాత విజయమ్మ మాట్లాడుతూ... సినిమాను బాగా తీశారు కోట్లాది మంది హృదయాల్లో ఉన్న వైఎస్ ఆర్ జ్ఞాపకాలను మళ్లీ చిత్ర దర్శక నిర్మాతలు తట్టి లేపారు. వైఎస్ ఆర్ మనముందు ప్రస్తుతం లేకున్నా ఈ చిత్రంతో ఆయన్ను మనముందుకు తీసుకు వచ్చారని విజయమ్మ అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ప్రతి నిమిషం ఆలోచించేవారు. ఆయన్ను ఆదరించినట్లుగానే సినిమాను ఆధరిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టడం నిర్మాతలను మరియు డిస్ట్రిబ్యూటర్లను కూడా ఆశ్చర్యంకు గురి చేస్తుంది. తప్పకుండా మంచి విజయం అందుకుంటుందని నమ్మాం కాని ఇంత భారీ విజయంను ఊహించలేదు అంటూ నిర్మాతలు అంటున్నారు. దర్శకుడు మహి వి రాఘవ ఎక్కడ కూడా గతి తప్పకుండా సినిమాను చక్కని దారిలో నడిపించి వివాదాలకు తావు ఇవ్వకుండా రాజశేఖర్ రెడ్డి అభిమానుల్లో ఇంకా ఆయన బతికే ఉన్నాడు అని నిరూపించాడు.

వైఎస్ ఆర్ అభిమానులకు ఇది ఒక గొప్ప కానుకగా చెప్పుకోవచ్చు. ఎన్నో బయోపిక్ లు వస్తున్నాయి. కాని ఇది చాలా అరుదైన బయోపిక్ గా నిలిచిందనుకోవాలి. ఎంటర్ టైన్ మెంట్ లేకుండానే ఇంతటి విజయాన్ని దక్కించుకోవడం మామూలు విషయం కాదు. ఈ విజయంతో వైఎస్ ఆర్ మహానేత అని మరోసారి నిరూపితం అయ్యింది.