Begin typing your search above and press return to search.

‘విజేత’ నష్టాలు భరించేదెవరు?

By:  Tupaki Desk   |   16 July 2018 10:16 AM GMT
‘విజేత’ నష్టాలు భరించేదెవరు?
X
మెగా ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో వస్తున్నాడంటే ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి ఉంటుంది. కానీ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ తెరంగేట్రం చేసిన ‘విజేత’ సినిమాను మాత్రం జనాలు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ఈ చిత్రానికి మినిమం బజ్ లేకపోయింది. అందుకు తగ్గట్లే ఓపెనింగ్స్ కూడా చాలా పూర్ గా ఉన్నాయి. దాదాపు రూ.7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటిదాకా కనీసం కోటి రూపాయల షేర్ కూడా రాబట్టలేదు. వీకెండ్లోనే అంతంతమాత్రంగా నడిచిన ఈ చిత్రం.. ఇక సోమవారం నుంచి మరీ నామమాత్రంగా నడుస్తోంది. దాదాపుగా ఈ చిత్ర థియేట్రికల్ రన్ ముగిసిపోయినట్లే అని చెప్పాలి. నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రం వల్ల దారుణంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఆయన చాలా ఎదురు దెబ్బలు తిన్నారు. ఇది వాటికి మించింది.

ఈ పరిస్థితుల్లో సాయిని ఆదుకోవడానికి చిరు కుటుంబం ముందుకొస్తుందా రాదా అన్నది చర్చనీయాంశం అవుతోంది. మిగతా మెగా కుర్ర హీరోలకు కలిసొచ్చినట్లుగా కళ్యాణ్ దేవ్ కు మెగా అభిమానుల అండ ఎంతమాత్రం కలిసి రాలేదు. ఎంతైనా అతను బయటి కుటుంబం నుంచి మెగా ఫ్యామిలీలోకి వచ్చినవాడు. దీంతో మెగా అభిమానులు అతడిని ఓన్ చేసుకోనట్లే ఉంది దీని ఓపెనింగ్స్ అవీ చేస్తుంటే. కళ్యాణ్ కోసం తమ వంతుగా చిరంజీవి.. రామ్ చరణ్.. అల్లు అర్జున్ సినిమాను ప్రమోట్ చేశారు కానీ.. అది ఎంతమాత్రం ఉపయోగపడలేదు. నిజానికి చిరు ఫ్యామిలీ నుంచే సాయికి ఈ సినిమా నిర్మించడానికి ప్రపోజల్ వెళ్లినట్లు చెబుతున్నారు. ఏమైనా తేడా వచ్చినా ఆదుకుంటారన్న భరోసాతోనే ఆయన ఈ చిత్రాన్ని రాజీ లేకుండా నిర్మించారట. ఇప్పుడాయన నిండా మునిగిపోతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ఆదుకునే ప్రయత్నం చేయాల్సిందే. కళ్యాణ్ సొంతంగా అయినా సాయికి నష్టాలు భర్తీ చేయక తప్పదు. ఆ విషయంలో చర్చలు నడుస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.